సిటీబ్యూరో, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నెట్‌వర్క్‌ను పూర్తి స్థాయిలో కట్టడి చేసే లక్ష్యంతో ఏర్పాటు చేసిన హెచ్‌న్యూ(హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్) ఏడాది కాలం పూర్తి చేసుకుంది. గడిచిన ఏడాది కాలంలోనే ఎన్నో ఉత్తమ ఫలితాలను సాధించింది. హైదరాబాద్‌తో పాటు ఇతర రాష్ర్టాలలోని నెట్‌వర్క్‌ను సైతం ధ్వంసం చేసి హెచ్‌న్యూ తన పేరును దేశ వ్యాప్తం చేసుకుంది. డ్రగ్స్ సైప్లె, డిమాండ్ లింక్‌లను ఎక్కడికక్కడే తెగ్గొట్టారు. డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు రాకుండా చేస్తామని హెచ్‌న్యూ ఏర్పాటులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు, అన్న మాట ప్రకారం సైప్లె, డిమాండ్ చైన్లను కట్ చేశారు.
డ్రగ్స్ విక్రయదారులు, కొనుగోలుదారులను అరెస్ట్ చేసి.. హెచ్‌న్యూ తన సత్తాను చాటింది. సంవత్సరం కాలంలో 104 కేసుల్లో 13 మంది విదేశీ, 185 మంది స్వదేశీ డ్రగ్ పెడ్లర్స్, 10 మంది ట్రాన్స్పోర్టర్స్, మరో 1075 మందిని అరెస్ట్ చేసింది. హెచ్‌న్యూ పేరు వింటేనే గోవా, ముంబైలో ఉన్న డ్రగ్ స్మగ్లర్లకు వణుకు పుట్టించారు. ఏండ్ల తరబడి డ్రగ్ మాఫియాలో ఆరితేరిన ప్రధాన కింగ్‌పిన్‌లను సైతం అరెస్ట్ చేసి జైల్లో పెట్టించారు. దీంతో గోవా, ముంబై నుంచి తెలంగాణ రాష్ర్టానికి డ్రగ్ సరఫరా చేయలేమంటూ డ్రగ్స్ విక్రేతలు చర్చించుకుంటున్నారు. హెచ్‌న్యూ డీసీపీలు చక్రవర్తి గుమ్మి, డి.సునీతారెడ్డి, ఇన్స్పెక్టర్లు పి.రాజేశ్, రమేశ్ రెడ్డి, ఎస్సైలు డానియెల్, వెంకటరాములు, 20 మంది సిబ్బందికి నగర పోలీస్ కమిషనర్ ఈ సందర్భంగా నగదు రివార్డులు అందజేశారు.