సిటీబ్యూరో, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): ఇద్దరు స్మగ్లర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి హైదరాబాద్ వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు 70 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సీపీ అంజనీకుమార్ గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన నర్సింగ్ సింగ్ గణేశ్ విగ్రహాలను తయారు చేస్తుంటాడు. కడ్తాల్ మైసిగండికి చెందిన రమావత్ రమేశ్ గతంలో గుడుంబా విక్రయాలు చేయడంతో 12 ఏండ్ల కిందట ఎక్సైజ్ పోలీసులు నాలుగు సార్లు అరెస్ట్ చేశారు. ఇతడు లంగర్‌హౌస్‌కు చెందిన భరత్‌సింగ్ దగ్గర పనిచేశాడు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు ప్రాంతం నుంచి గంజాయిని నగరానికి సరఫరా చేస్తూ..రెండు సార్లు భరత్సింగ్తో పాటు అరెస్టయ్యాడు.
2020లో జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత రమావత్ రమేశ్, భరత్‌సింగ్ బావమరిది అయిన నర్సింగ్సింగ్తో పరిచయమయ్యాడు. ఈ క్రమంలో తనకు సీలేరులో గంజాయి సరఫరా చేసే రవి అనే వ్యక్తితో పరిచయం ఉందని, అక్కడి నుంచి హైదరాబాద్‌కు సరుకు తీసుకొచ్చేందుకు అవకాశముందంటూ రమావత్ చెప్పడంతో, నర్సింగ్ దందా చేయాలని ప్లాన్ చేశాడు. సీలేరు నుంచి గంజాయి తెచ్చి హైదరాబాద్‌లో ఇచ్చేందుకు ఒక్కో ట్రిప్‌నకు రూ. 10 వేలు ఇస్తానంటూ రమావత్ రమేశ్‌తో నర్సింగ్ ఒప్పందం చేసుకున్నాడు.
తన ఆటోలో సీలేరు వెళ్లి అక్కడ రెండు కిలోలు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలకు కొని, దానిని నగరానికి తెచ్చి నర్సింగ్కు రమేశ్ అందించే వాడు. నర్సింగ్ 10 గ్రాములతో ఒక ప్యాకెట్ తయారు చేసి.. రూ. 150కి వినియోగదారులకు అమ్మేవాడు. సీలేరులో ఉన్న గంజాయి విక్రయదారుడికి డబ్బును గూగుల్ పేలో నర్సింగ్ పంపిస్తూ వస్తున్నాడు. ఈ నెల మూడో వారంలో రూ. 50 వేలు రవికి ఆన్లైన్లో డబ్బు చెల్లించి.. భారీగా గంజాయి కొనుగోలుకు ఆర్డర్ పెట్టారు. రమావత్ రమేశ్ తన ఆటోలో ఈ నెల 17న సీలేరు వెళ్లి.. 35 బండిల్స్‌లో 70 కిలోల గంజాయిని రవి వద్ద కొని, హైదరాబాద్‌కు 21న తిరిగి వచ్చి నర్సింగ్‌ను కలిశాడు.
పోలీసుల నిఘా ఎక్కువగా ఉండటంతో రమావత్ రమేశ్ జూబ్లీహిల్స్ రహమత్‌నగర్‌లో ఒక గదిని అద్దెకు తీసుకొని గంజాయిని దాచిపెట్టాడు. శుక్రవారం తన ఆటోలో లోడ్ చేసి అవసరమైన వారికి పంపిణీ చేసేందుకు వెళ్తుండగా, విశ్వసనీయ సమాచారంతో వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు, జూబ్లీహిల్స్ పోలీసుల సహకారంతో వల పన్ని పట్టుకున్నారు. నర్సింగ్సింగ్, రమావత్ రమేశ్‌లను అరెస్ట్ చేసి వారి వద్ద లభించిన 70 కిలోల గంజాయి, రవాణాకు ఉపయోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలోవెస్ట్జోన్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు అధికారులు పాల్గొన్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష నిర్వహించారని, రాష్ర్టాన్ని డ్రగ్స్ రహితంగా మార్చాలని ఆదేశాలు జారీ చేశారని సీపీ అంజనీకుమార్ తెలిపారు. అప్పటి నుంచి నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, డ్రగ్స్‌పై 32 కేసులు నమోదు చేశామని, అందులో 26 కేసులు కేవలం గంజాయికి సంబంధించినవేనని చెప్పారు. 389 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, 60 మందిని అరెస్ట్ చేసి.. ఆరు మందిపై పీడీయాక్ట్ ప్రయోగించామని సీపీ వివరించారు.