కంటోన్మెంట్, ఆగస్టు 28: పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆరేండ్లుగా జాబ్ మేళాల ద్వారా 15వేల మంది నిరుద్యోగలకు ఉద్యోగాలు ఇప్పించామని నగర సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. కృషి, పట్టుదల ఉంటే యువత లక్ష్యాలను సాధించవచ్చని చెప్పారు. సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలోని పీజీ కాలేజీలో శనివారం బేగంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్‌రావు ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. నగరం నలుమూలల నుంచి సుమారు 3 వేల మంది నిరుద్యోగులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన నగర సీపీ అంజనీకుమార్ జ్యోతిప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ప్రతిభ, నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కఠోర శ్రమతో ఎంత పెద్ద లక్ష్యాన్ని అయినా సులభంగా చేరుకోవచ్చని చెప్పారు.
నగర పోలీస్ శాఖ, నార్త్‌జోన్ పోలీసులు, టీఎంఐ సంయుక్తంగా నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. నగరంలోని ప్రముఖ సాఫ్ట్వేర్, బ్యాంకింగ్, రియల్టర్, ఫార్మసీ, మెడికల్, మార్కెటింగ్ రంగాలకు సంబంధించిన 27 కంపెనీలు హాజరయ్యాయి. సుమారు 2,159 మంది నిరుద్యోగుల నుంచి నిర్వాహకులు బయోడేటాను స్వీకరించారు. వివిధ ఉద్యోగాలకు సుమారు 979 మంది ఎంపిక అవ్వగా, 247 మందికి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో బేగంపేట కార్పొరేటర్ మహేశ్వరీశ్రీహరి, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్, బేగంపేట ఏసీపీ నరేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.