సిటీబ్యూరో, మార్చి 1 ( నమస్తే తెలంగాణ ) : హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న కొన్ని జోన్లు.. మరికొన్ని డివిజన్లు.. ఇంకొన్ని పోలీస్స్టేషన్లలో అంతర్గతంగా జరుగుతున్న అవినీతి, పోలీసుల మధ్య కుమ్ములాటలు ఆ శాఖలోనే చర్చకు దారితీస్తున్నాయి. నెలరోజుల్లో కమిషనరేట్ పరిధిలో ఒక ఏసీపీ, ఐదుగురు ఇన్స్పెక్టర్లు, ఒక హెడ్‌కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌పై సీపీ సీవీ ఆనంద్ శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. స్టేషన్‌కు వచ్చే కేసులలో ఎవరి పరిధిలో వారు పనిచేయాల్సింది పోయి కొన్ని ప్రత్యేక , ఆర్థికపరమైన కేసుల్లో ఎవరు ఏది డీల్ చేయాలో తేల్చుకోవడంలో సీఐ,డీఐల మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్పష్టంగా ఎవరు ఏం చేయాలనేది నిబంధనలు ఉన్నప్పటికీ వాటిని తుంగలో తొక్కి ఈ గొడవలకు దిగుతున్నారంటూ పలు స్టేషన్లలో సీఐ, డీఐల మధ్య వివాదాలు సీపీ దృష్టికి వెళ్లాయి. మరోవైపు కొన్ని జోన్లలో ఏసీపీలు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో నిర్వహణపై దృష్టి పెట్టకుండా అక్రమార్జనే లక్ష్యంగా పనిచేస్తున్నారంటూ ఫిర్యాదులున్నాయి.
కమిషనరేట్‌లో కొందరు పోలీసులపై వస్తున్న ఫిర్యాదులతో సీపీ సీవీ ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో చాలా వరకు పోలీస్స్టేషన్లలో అధికారుల మధ్య ఉన్న కుమ్ములాటలు శాఖకు చెడ్డపేరు తెచ్చేలా ఉన్నాయంటూ సీరియస్ అయ్యారు. తన వద్దకు వచ్చిన ఫిర్యాదులతో పాటు ఆయా జోన్లలో జరుగుతున్న అక్రమవ్యవహారాలపై జరుగుతున్న ప్రచారాన్ని పరిశీలిస్తున్నారు. పలు స్టేషన్లలో జరుగుతున్న వ్యవహారాలపై ఒక ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేసి వారి ద్వారా నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే సీపీ చేతిలో అక్రమార్కుల లిస్ట్ ఆధారాలతో సహా ఉన్నాయని పోలీసు కమిషనరేట్‌లో చర్చిస్తున్నారు. కొందరు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు తమ వద్దకు వచ్చిన కేసులను పక్కదోవ పట్టించి డబ్బులు దండుకున్నట్లుగా కూడా ఆయన దృష్టికి వచ్చింది. కమిషనర్ ఆనంద్ ఈ వివాదాలన్నిటిని సీరియస్‌గా తీసుకున్నారు. కమిషనరేట్‌లో అంతర్గత ప్రక్షాళన చాలా ముఖ్యమని, ఇటువంటి అక్రమార్కులపై చర్యలు తప్పవంటూ ఆయన హెచ్చరించినట్లు తెలిసింది. పలు స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేసి వాటిని కూడా గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తామని సీపీ చెప్పినట్లు సమాచారం. ఇప్పటివరకు కొందరు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్న సీపీ త్వరలోనే మరికొంతమందిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది.