సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): రాబోయే 15 రోజుల్లో హైదరాబాద్‌ను వందశాతం కొవిడ్ వాక్సినేషన్ జరిగిన నగరంగా చేయుటకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, డీఎంహెచ్ఓలు, ఎస్పీహెచ్ఓలతో బీఆర్కే భవన్లో గురువారం నిర్వహించిన వర్క్‌షాపులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడారు. నగరంలోని అన్ని కాలనీలను 100శాతం వ్యాక్సినేషన్ కాలనీలుగా తీర్చిదిద్దుటకు ఎమ్మెల్యేలు, స్థానిక కార్పొరేటర్లను భాగస్వాములను చేస్తూ జీహెచ్ఎంసీ, ఆరోగ్యశాఖల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో వ్యవహరించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ సూచించారు. ఇంటింటికీ తిరిగి 18సంవత్సరాల పైబడిన అర్హత కలిగిన వ్యక్తులను గుర్తించి టీకాలు వేయాలని సూచించారు. ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఆదేశించారు. మొబైల్ వ్యాక్సినేషన్‌కు అనూహ్య స్పందన వస్తున్నట్లు సీఎస్ పేర్కొన్నారు. అదే స్ఫూర్తితో ఇంటింటికీ తిరిగి మిగిలిన వ్యక్తులకు టీకాలు వేసేందుకు అవసరమైన సిబ్బంది, మెటీరియల్‌తో కాలనీల వారీగా టీమ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి రిజ్వీ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోమ్కుమార్, మేడ్చల్-మల్కాజ్గిరి కలెక్టర్ హరీశ్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎం.హన్మంతరావు, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ రావు, ఓఎస్టీ సీఎం డాక్టర్ గంగాధర్, హైదరాబాద్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటి, రంగారెడ్డి డీఎంహెచ్ఓ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, మేడ్చల్-మల్కాజ్గిరి డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లికార్జున్, సంగారెడ్డి డీఎంహెచ్ఓ డాక్టర్ గాయత్రి తదితర అధికారులు పాల్గొన్నారు.