మహమ్మారి కరోనా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న పక్కా చర్యలు సత్ఫలితాలిస్తున్నది. ప్రజలపై భారం పడకుండా కంపెనీల నుంచి వ్యాక్సిన్లు కొనుగోలు చేసి త్వరత్వరగా వేయడంతో గ్రేటర్ వ్యాప్తంగా తొలిడోసు 90 శాతం పూర్తయ్యింది. ఈ విషయాన్ని ప్రజాఆరోగ్య సంచాలకుడు (డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు బుధవారం వెల్లడించారు. కరోనా తొలిదశలో టీకా తీసుకునేందుకు జనం ముందుకు రాలేదని, రెండోదశలో వైరస్ తీవ్రత అధికమయ్యాక టీకా వేయించుకునే వారి సంఖ్య అమాంతం పెరిగిందని చెప్పారు. ఫ్రంట్లేన్ వారియర్లు, సూపర్‌స్ప్రెడర్లు, ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, గేటెడ్ కమ్యూనిటీలు, సంచార వాహనాల ద్వారా వ్యాక్సిన్ లక్ష్యాన్ని పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. గ్రేటర్లో టీకాల కొరత లేదని, అవసరమైనన్ని డోసులు నిల్వ ఉన్నాయన్నారు. థర్డ్‌వేవ్ వస్తుందని అనుకోవడం లేదని, వచ్చినా అన్ని ముందస్తు చర్యలు చేపట్టినట్లు డీహెచ్ వెల్లడించారు.
కరోనా మూడోదశ (థర్డ్‌వేవ్) వస్తుందనే ఆందోళన అవసరం లేదని, అదే సమయంలో రాదనే నిర్లక్ష్యం కూడా తగదన్నారు. వివాహాలు, ఇతర శుభకార్యాలు జరుగుతుండడంతో జాగ్రత్తగా ఉండాలని, ప్రతిఒక్కరూ కరోనా నియమాలు కచ్చితంగా పాటించాలని సూచించారు. మాస్క్ లేకుండా ఆరుబయట తిరుగొద్దని హితవు పలికారు.