Elevated Corridor | మేడ్చల్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): ఎలివేటేడ్ కారిడార్ భూ సేకరణ పనులు అంత సులువుగా ముందుకు సాగే పరిస్థితి కనిపించడం లేదు. ప్యారడైజ్ నుంచి శామీర్‌పేట్ వరకు రాజీవ్ రహదారిపై నిర్మించనున్న ఎలివేటేడ్ కారిడార్‌కు అవసరమైన భూ సేకరణ పనులలో కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. ఈ క్రమంలో భూ సేకరణ పనులను వారం రోజుల వరకు చేయవద్దని కోర్టు నుంచి స్టే వచ్చింది. వారం తర్వాత తిరిగి భూ సేకరణ పనులను ప్రారంభించి భూ సేకరణ పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నప్పటికీ భూ సేకరణ పనులు పూర్తయ్యేందుకు సాంకేతిక సమస్యలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుందని అధికారులు విశ్లేషిస్తున్నారు. 18 కిలోమీటర్ల పొడవైన విస్తరణకు అవసరమైన భూమి కోసం రెండు జిల్లాలో భూ సేకరణ జరుగుతున్నది. లోతుకుంట నుంచి శామీర్‌పేట్ రింగ్ రోడ్డు వరకు 12 కిలో మీటర్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఉండగా లోతుకుంట నుంచి ప్యారడైజ్(జేబీఎస్)వరకు 6 కిలోమీటర్లు హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉంది. ప్రస్తుతం ఉన్న రాజీవ్ రహదారిని రెండు వందల ఫీట్ల రోడ్డుగా విస్తరించనున్నారు. ఈ రహదారిపైన 18 కిలోమీటర్ల మేరకు బ్రిడ్జిని నిర్మించనున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలివేటేడ్ కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదించిన విషయం విదితమే.
329 నిర్మాణాలకు మార్కింగ్
హైదరాబాద్ జిల్లా పరిధిలోకి వచ్చే లోతుకుంట నుంచి ప్యారడైజ్(జేబీఎస్)వరకు వారం రోజుల పాటు భూ సేకరణ పనులకు బ్రెక్పడింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని శామీర్‌పేట్ రింగ్‌రోడ్డు నుంచి లోతుకుంట వరకు వంద శాతం భూ సేకరణ పనులు పూర్తయైనట్లు అధికారులు వెల్లడిస్తుండంగా భూ సేకరణలో కోల్పోతున్న ఆస్తుల యజమానులకు నష్టపరిహారం అందించే విషయమై స్పష్టంగా చెప్పలేకపోతున్నట్లు అధికారులపై ఆరోపణలు వస్తున్నాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో కారిడార్ కింద 329 నిర్మాణాలు నేలమట్టం కానున్నాయి. వాటికి సంబంధించి మార్కింగ్ పనులను పూర్తి చేశారు. హైదరాబాద్ జిల్లా పరిధిలో భూ సేకరణ పనులు ప్రారంభమైతే ఎన్ని నిర్మాణాలు, రోడ్డు విస్తరణకు ఎంత భూమి అవసరమవుతుందని భూ సేకరణ తర్వాత తేలనుంది. కారిడార్ కింద ఆస్తులు కోల్పోతున్న వారికి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి పూర్తి అవగాహన నష్టపరిహారం ప్యాకేజీని వివరించి భూ సేకరణ పనులను ప్రారంభిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. భూ సేకరణ పనులు పూర్తి చేసి వివరాలను అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు.