రంగారెడ్డి, నవంబర్ 13 (నమస్తేతెలంగాణ) : మున్సిపాలిటీల్లో కీలక భూమిక పోషిస్తున్న టౌన్‌ప్లానింగ్ అధికారుల అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. జిల్లాలో పనిచేస్తున్న టౌన్‌ప్లానింగ్ అధికారుల్లో కొందరు మినహా.. మిగతావారంతా వివిధ జిల్లాల నుంచి డిప్యూటేషన్లపై వచ్చి పనిచేస్తున్నారు. వచ్చినప్పటి నుంచి మున్సిపాలిటీల్లో ఆపరేషన్లు మొదలు పెట్టారు. మున్సిపాలిటీల్లో అత్యంత కీలకమైన టౌన్‌ప్లానింగ్ అధికారులుగా పనిచేస్తున్న పలువురు అవినీతి తారాస్థాయికి చేరిందనే విమర్శలున్నాయి. వీరి అవినీతి, అక్రమాలపై మున్సిపాలిటీల్లో బహిరంగంగా చర్చించుకుంటున్నారు.
ముఖ్యంగా రంగారెడ్డిజిల్లాలోని మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో అవినీతి రాజ్యమేలుతోందని రోజురోజుకు ఫిర్యాదుదారుల సంఖ్య పెరిగింది. టౌన్‌ప్లానింగ్ అధికారుల ఆట కట్టించేందుకు బాధితులు ముందుకొస్తున్నారు. అందులో భాగంగానే ఆదిబట్ల మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికారి వరప్రసాద్ తన అసిస్టెంట్ వంశీతో కలిసి ఓ భవన నిర్మాణానికి అనుమతి కోసం పెద్దమొత్తంలో లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడైన ఆనంద్ అంత డబ్బు ఇచ్చుకోలేని పరిస్థితిలో ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు గురువారం ఆదిబట్ల మున్సిపల్ కార్యాలయంపై దాడిచేసి పట్టుకున్నారు. దీంతో మున్సిపాలిటీలో టౌన్‌ప్లానింగ్ అధికారుల లీలలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.