సిటీబ్యూరో, అక్టోబర్ 26: నడిరోడ్డుపై కాంగ్రెస్ ఎన్నికల సభ నిర్వహించినా..బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసుకున్నా.. కాంగ్రెస్‌పై కేసు పెట్టకుండా ఎన్నికల కమిషన్ కళ్లు మూసుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా మధురానగర్‌లోని రోడ్డుపై ఆదివారం కాంగ్రెస్ నాయకులు ప్రసంగాలతో పాటు..అక్కడే కార్యకర్తలకు బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేశారు. ఎన్నికల అధికారులకు ఇది కనిపించలేదు. అదే మధురానగర్ కాలనీలోని అపార్ట్మెంట్ లోపల కాలనీ సంక్షేమ సంఘం వారు బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేసుకొని, సమావేశం ఏర్పాటు చేసుకోగా ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్‌లతో పాటు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ హాజరయ్యారు.

ఎన్నికల అధికారి ఎఫ్ఎస్టీ 5 ఏ టీమ్‌కు చెందిన డిప్యూటీ తహసీల్దార్ ఎండీ ఐజాజ్ ఫిర్యాదు మేరకు బ్రేక్‌ఫాస్ట్ ఏర్పాటు చేసిన మనోహర్‌రావు, మధురానగర్ కాలనీ సంక్షేమ సంఘం సెక్రటరీ సాంబశివరావు,కోనేరు అజయ్‌పై మధురానగర్ పోలీసుస్టేషన్లో కేసు నమోదైంది. ఇక్కడి ఎన్నికల అధికారులు అధికార పార్టీకి తొత్తుగా మారి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న తీరుపై బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కాంగ్రెస్ సభ పై ఎన్నికల కమిషన్‌కు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు కార్పొరేటర్ దేదీప్య తెలిపారు.