సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ పరిధిలోని కర్మన్ ఘాట్, నందిహిల్స్‌లోని పలు సర్వే నంబర్లలో ఉన్న భూములపై వివాదస్పద పిడుగు పడింది. దశాబ్దాల కాలం నుంచి నివాసం ఉంటున్న సామాన్యులకు ఒక్కసారిగా గట్టి షాక్ ఇచ్చేలా హైకోర్టు తీర్పు వెలువడింది. కర్మన్‌ఘాట్ పరిధిలోని వేలాది ఇండ్ల భవిష్యత్ ఇప్పుడు ఆగమ్యగోచరంగా మారింది. గతంలో మంజూరైన ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్లను తాజాగా హైకోర్టు రద్దు చేయడంతో… ఈ భూముల్లో రిజిస్ట్రేషన్లు, ఎలాంటి నిర్మాణ అనుమతులు ఇవ్వకూడదంటూ రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు.
దశాబ్ధాలుగా కష్టపడి సంపాదించుకున్న ఆస్తులకు రక్షణ లేకుండా పోతోందంటూ స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 2004లో దాఖలైన రిట్ పిటిషన్(W.P. No.11087/2004)పై హైకోర్టు ఫిబ్రవరి 7 2026లో కీలక తీర్పునునిచ్చింది. గతంలో 2004లో మార్చి 3న అప్పటి రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ జారీ చేసిన కామన్ ఆర్డర్‌ను హైకోర్టు పూర్తిగా రద్దు చేసింది. రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గతంలో ఇచ్చిన అసలు విచారణలోనే తీవ్రమైన చట్టపరమైన లోపాలు ఉన్నాయని నిర్ధారించింది.
ముఖ్యంగా మరణించిన వ్యక్తుల వారి చట్టబద్ధ వారసులను పార్టీ చేయకుండానే విచారణ జరిపారని, అలాగే కోర్టు ఆదేశించిన అసలు రెవెన్యూ రికార్డులను సమర్పించడంలో అధికారులు విఫలమయ్యారని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. 01-11-1973 నాటికి ఇనాం భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో నిర్ధారించకుండానే గతంలో ఓఆర్సీలూ మంజూరు చేశారని, అందుకే ఆ సర్టిఫికెట్లన్నీ చెల్లవని హైకోర్టు తేల్చి చెప్పింది.
ఈ వ్యవహారంలో 1970వ దశకం నాటి ల్యాండ్ రిఫార్మ్ ట్రెబ్యునల్ రికార్డులు ఇప్పుడు సంచలనంగా మారాయి. రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రీఫార్మ్స్ ట్రెబ్యునల్ రికార్డుల ప్రకారం(సీసీ నెం. ఈ/ 2476, 2477, 2478/1975) కర్మన్‌ఘాట్ గ్రామంలోని సర్వే నెంబర్ 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30 ఈ సర్వే నంబర్ల పరిధిలోని భూములపైనే ఇప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం కొత్తగా విచారణ జరగాల్సి ఉంది. కోర్టు తీర్పు నేపథ్యంలో కందుకూరు డివిజన్ స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్ జగదీశ్వర్ రెడ్డి, సరూర్ నగర్, బాలాపూర్ మండలాల తహసీల్దార్లకు లేఖ ద్వారా కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఆరు నెలల్లోనూ విచారణ పూర్తి చేసి ఇనాందార్ వారసులకు, ఇతర ప్రైవేటు భాగస్వాములకు నోటీసులు ఇచ్చి, ఆరు నెలల వ్యవధిలో విచారణ ముగించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేతకు అభ్యర్థన పూర్తయ్యే వరకు ఈ సర్వే నెంబర్ల పరిధిలోని భూములకు ఎలాంటి రిజిస్ట్రేషన్లు, నిర్మాణ అనుమతులు ఇవ్వరాదన్న బాధితుల దరఖాస్తును పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు. దీనిపై కోర్టు తీర్పు ప్రకారం ఆయా సర్వే నెంబర్ల భూములపై విచారణ చేస్తామని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఎప్పుడో కట్టుకుని, స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న విషయాన్ని కూడా కోర్టుకు తెలిపినట్లుగా ఆయన వివరించారు.
దశాబ్ధాల కాలం నాటి రికార్డుల తవ్వకాలతో ఎప్పుడో వేసిన లే అవుట్లలో ప్లాట్లు కొని, కష్టపడి ఇళ్లు కట్టుకుని, మున్సిపల్ పన్నులు కడుతున్న వేలాది మందికి తాము ఉంటున్న ఇల్లు రేపు ఉంటుందో, కూలుతుందో తెలియని గందరగోళం నెలకొంది. ఈ ప్రాంతంలో ప్లాట్లు, ఇండ్ల అమ్మకాలు, కొనుగోళ్లు ఒక్కసారిగా నిలిచిపోతే… భవిష్యత్ అవసరాల దృష్ట్యా భద్రంగా స్థిరాస్థి ఉందని అనుకునే వారు కూడా ఉలిక్కి పడే ప్రమాదం ఉంది.
అధికారుల తప్పులకో, లేక దశాబ్ధాల నాటి యాజమాన్య వివాదాలతో, ఇప్పుడు అక్కడ నివసిస్తున్న అమాయక ప్రజలను బలి చేయడం ఎంతవరకు న్యాయమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ, ఉన్నతాధికారులు స్పందించి, సామాన్యుల ఇండ్లకు, వారి హక్కులకు భంగం కలగకుండా మానవీయ నోణంలో ఈ సమస్యను పరిష్కరించాలని, కబ్జాతో భూములు చేజిక్కించుకున్న వారి భరతం పట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.