ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే క్రమబద్ధీకరించాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నట్లు హెచ్చరించారు. సమ్మె నోటీసును వీసీకి అందజేసేందుకు కాంట్రాక్ట్ అధ్యాపకులు ప్రయత్నించగా అధికారులు అందుబాటులోకి రాలేదు.
దీంతో పరిపాలన భవనం ప్రధాన గేటు ఎదుట ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇందిరాపార్క్ వద్ద తమ డిమాండ్ల సాధన కొరకు మహాధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. పదిమంది మహిళా అధ్యాపకులు వీసీకి నోటీసు అందజేసేందుకు లోపలికి వెళ్లగా వారిని రాత్రి 7 గంటల వరకు వెయిట్ చేయించి, అపాయింట్మెంట్ ఇవ్వకుండా వేధిస్తున్నారని మండిపడ్డారు.
కార్యక్రమంలో అధ్యాపక సంఘం నేతలు డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ పరశురాం, డాక్టర్ ఉపేందర్, డాక్టర్ కుమార్, డాక్టర్ విజయేందర్ రెడ్డి, డాక్టర్ ఓ కృష్ణయ్య, డాక్టర్ తిరుపతి, డాక్టర్ పాండయ్య, డాక్టర్ తాళ్లపల్లి వెంకటేశ్వర్లు, డాక్టర్ రేష్మా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.