గోల్నాక, అక్టోబర్ 23 : కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అంటూ నగరంలో దాదాపు 50 ఏండ్ల క్రితం నిర్మించిన మూసారాంబాగ్ బ్రిడ్జి ప్రస్థానం ముగిసింది.అంబర్పేట నుంచి దిల్సుఖ్నగర్, మలక్ పేట ప్రధాన ప్రాంతాలను కలిపే మూసారాంబాగ్ బ్రిడ్జి కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.ఇప్పటికే నత్తనడకన జరుగుతున్న హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు పాత బ్రిడ్జి కూల్చి వేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల ప్రజలను అప్రమత్తం చేయకుండా జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి రెండు టీఎంసీలకు పైగా నీటిని ఒకే సారి వదలడంతో వరద ప్రభావం ఉగ్రరూపం దాల్చింది. దీంతో ఎన్నో ముంపు ప్రాంతాల కుటుంబాలు వీధిన పడ్డాయి.అధికారుల సమన్వయ లోపం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే మూసారాంబాగ్ బ్రిడ్జి నీట మునిగి పనికి రాకుండా పోయిందని విమర్శలు సైతం వెల్లువెత్తాయి. తాజాగా బ్రిడ్జి పటిష్టతను పరిశీలించిన జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు కొన్ని రోజులుగా రాకపోకలను పూర్తిగా నిలిపి వేశారు.ప్రత్యామ్నాయ మార్గం చూపకుండా కూల్చివేత పనులు ప్రారంభించారు.
హైలెవల్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా రూ.52 కోట్ల అంచనా వ్యయంతో 220 మీటర్ల పొడవు 29.5 మీటర్ల వెడల్పుతో వంతెనకు ఇరు వైపులా 3.5 మీటర్ల కాలిబాటతో కూడిన మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 సెప్టెంబర్లో శంకుస్థాపన చేసి 2025 జనవరి అంటే ఏడాది లోపు పూర్తి చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది.ఆ ప్రభుత్వ హయాంలోనే నాలుగు పిల్లర్ల పనులు పూర్తి చేశారు. కాగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బ్రిడ్జి నిర్మాణ పనులు నత్తకు నడక నేర్చేలా కొనసాగుతున్నాయి. కొత్త బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం నేపథ్యంలో మూసారాంబాగ్ పాత బ్రిడ్జిపై ఒక వైపే రాకపోకలు సాగడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అంబర్ పేట నుంచి మూసారాంబాగ్ మీదుగా మలక్ పేట, దిల్సుఖ్ నగర్ వెళ్లడంతో పాటు అటు నుంచి ఇటు వైపు వచ్చే వాహనదారులకు 30 మీటర్ల దూరం మాత్రమే ఉండేది.. కానీ ప్రస్తుతం అంబర్ పేట అలీకేఫ్ చౌరస్తా నుంచి జిందాతిలస్మాత్, గోల్నాక కొత్త బ్రిడ్జి మీదుగా మూసారాంబాగ్ చేరుకోవాల్సి వస్తోంది.సుమారు 5 కిలో మీటర్లకు పైగా ప్రయాణికులకు దూరభారం పడనుంది. అంబులెన్సులు సైతం గోల్నాక నుంచి చుట్టూ తిరిగి వెళ్లే సరికి రోగుల ప్రాణాలు పోయేపరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేండ్లు కావస్తున్నా కొత్త బ్రిడ్జి నిర్మాణంలో జాప్యం ఎందుకు జరుగుతోందోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసమర్థ పాలన , అధికారుల అనాలోచిత నిర్ణయాలతో ఈ దుస్థితి దాపురించిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.