కవాడిగూడ, జూలై 3: రాష్ట్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కంటిన్యూయేషన్ ఆర్డర్లు తక్షణమే జారీ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్ అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జే వెంకటేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కుమారస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పద్మశ్రీ మాట్లాడుతూ.. గత 25 సంవత్సరాలుగా లక్షా 40వేల మందికి పైగా ఉద్యోగులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టి 20 నెలలు కావస్తున్నా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేదని ఆరోపించారు.
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కంటిన్యూయేషన్ ఆర్డర్లను గత ఏప్రిల్ నెలలో జారీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. జీఎస్టీ విభాగంలో గత ఏప్రిల్ నుంచి 100 మంది ఉద్యోగులను తొలగించారని వారు ఆరోపించారు.
ఇంతవరకు వేతనాలు కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. బాకాయి వేతనాల చెల్లింపు, సమాన పనికి సమాన వేతనంతో పాటు ఉద్యోగ భద్రత డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామని వారు హెచ్చరించారు. ఫెడరేషన్ నాయకులు సాంబయ్య, సోమయ్య తదితరులు పాల్గొన్నారు.