బండ్లగూడ, మార్చి 26: బండ్లగూడ కార్పొరేషన్ పరిధిలో కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు వెచ్చించి ఆర్భాటంగా ప్రారంభించిన ఫిల్టర్ బెడ్ల ద్వారానే మురికి నీరు రావడం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. హిమాయత్ సాగర్ నుంచి సరఫరా అయ్యే నీటిని శుద్ధిచేసి పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం హిమాయత్ సాగర్ వద్ద ఇటీవల ఐదు ఫిల్టర్ బెడ్లను ఏర్పాటు చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు తదితరులు దీనిని ఆర్భాటంగా ప్రారంభించారు. దీనికోసం 6 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. ఇక అప్పటి నుంచి మంచినీటి కష్టాలు తీరాయని ప్రజలు భావించారు. అయితే ఆ ఫిల్టర్ బెడ్లు సరైన రీతిలో పనిచేయకపోవడంతో కలుషిత నీళ్లు వస్తున్నాయని ప్రజలు వాపోతున్నారు.
విష జ్వరాలు రావా..
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిమాయత్ సాగర్ నుంచి పంపిణీ చేస్తున్న మంచినీరు కలుషితంగా వస్తున్నాయని బుధవారం ఉదయం హిమాయత్ సాగర్ గ్రామస్తులు జలమండలి అధికారి గోవింద్ నిలదీశారు. కలుషిత నీళ్లు తాగితే తమకు విష జ్వరాలతో పాటు అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిల్టర్లను మరోసారి తనిఖీలు చేసి నీటిని శుభ్రపరచాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే హిమాయత్ సాగర్ జలాశయం నుంచి బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు గ్రామాలకు పంపిణీ చేస్తున్న మంచినీటిని పూర్తిస్థాయిలో ఫిల్టర్ చేసి ప్రజలకు అందించాలని స్థానికులు కోరుతున్నారు. 20 రోజులుగా తమకు కలుషిత నీరు వస్తున్నాయని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని కలుషిత నీరు రాకుండా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
రోజూ 1,20,000 లీటర్లు
బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలకు హిమాయత్ సాగర్ జలాశయం నుంచి 1,20,000 లీటర్ల నీటిని ఫిల్టర్ల ద్వారా శుద్ధి చేసి పంపిణీ చేస్తున్నామని జలమండలి అధికారి గోవింద్ గౌడ్ తెలిపారు. ఏదైనా పని జరిగి ఉంటే మట్టి నీళ్లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిరోజూ ఫిల్టర్ చేసిన నీళ్లను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.