సిటీబ్యూరో, జూలై 28(నమస్తే తెలంగాణ): వినియోగదారుడికి ఒరిజినల్ సేల్‌డీడ్ అప్పజెప్పాలని, అంతే గాకుండా రూ.లక్ష నష్ట పరిహారం ఇవ్వాలని యాక్సిస్ బ్యాంక్‌కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 అధ్యక్షురాలు బి.ఉమా వెంకట సుబ్బలక్ష్మి, సభ్యురాలు సి.లక్ష్మిప్రసన్నలతో కూడిన బెంచ్ ఆదేశించింది. నగర శివారులోని కొంపల్లికి చెందిన పద్మజారాణి ప్రభుత్వ ఉద్యోగి. యాక్సిస్ బ్యాంక్ నుంచి మార్ట్గేజ్ కింద రూ.20 లక్షల లోన్ తీసుకున్నారు. అనంతరం, తిరిగి చెల్లించారు. జూలై 2, 2021 బ్యాంకు నో డ్యూ సర్టిఫికెట్ కూడా జారీ చేసింది. దీంతో తాను కుదవపెట్టిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తిరిగివ్వాలని బ్యాంకును కోరింది. అయినా స్పందించకపోవడంతో వినియోగదారు వేదనకు గురయ్యారు. తన పత్రాలు ఇప్పించాలని వినియోగదారుల కమిషన్-1ను ఆశ్రయించగా, కేసు పూర్వపరాలు పరిశీలించింది. 45 రోజుల్లో ఒరిజినల్ రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ డాక్యుమెంట్లను బాధితురాలికి అందజేయాలని ఆదేశించింది. దీంతో పాటు రూ.లక్ష నష్ట పరిహారంగా చెల్లించాలని, రూ.10 వేలు కోర్టు ఖర్చుల కింద ఇవ్వాలని ఆదేశించింది. 45 రోజుల్లో తమ ఆదేశాలు పాటించాలని సూచించింది.
సేవల్లో లోపం సహించేది లేదు
వినియోగదారుడికి రూ.861 రీఫండ్‌తో పాటు రూ.88 వేలు నష్ట పరిహారంగా చెల్లించాలని ఓలా క్యాబ్ సంస్థకు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 అధ్యక్షుడు ఎం.రాంగోపాల్‌రెడ్డి, సభ్యులు డి.శ్రీదేవి, జె.శ్యామలతో కూడిన బెంచ్ ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.., అబిడ్స్‌కు చెందిన సామ్యేల్ ఓలా వినియోగదారుడు. 2021 అక్టోబర్ 19న ఓలా క్యాబ్ బుక్ చేసుకొన్నాడు. తన భాగస్వామితో పాటు మరో సహాయకుడు నగరంలోని వివిధ ప్రాంతాలను సందర్శించేందుకు బయలుదేరాడు. కొద్ది దూరం వెళ్లగానే డ్రైవర్ ఏసీ ఆఫ్ చేశాడు. అంతే గాకుండా కారులో అపరిశుభ్రతతో బ్యాడ్‌స్మెల్ పెరిగిపోయింది. ఏసీ వేయాలని డ్రైవర్‌ను కోరారు. అయినా స్పందించకుండా ప్రయాణికులపై డ్రైవర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతే గాకుండా 5 కిలోమీటర్లకు రూ.150-200 రావాల్సిన అమౌంట్, రూ.861 వచ్చింది. మధ్యలోనే ప్రయాణికులను దించేసి డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడు. దీంతో వినియోగదారుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన అనంతరం బాధితులకు 36 శాతం వడ్డీతో కలిపి రూ.861 రీఫండ్‌తో పాటు మానసికంగా వేధింపులకు గురిచేసినందుకు రూ.88 వేలు, రూ.7వేలు కేసు ఖర్చుల కింద చెల్లించాలని ఆదేశించింది.