Engineering Seats | సిటీబ్యూరో, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ సీట్లు ఇప్పిస్తానంటూ నమ్మించి పలువురు విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేసి మోసానికి పాల్పడిన కన్సల్టెన్సీ నిర్వాహకులపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. వివిధ ప్రాంతాలకు చెందిన 29 మంది నుంచి రూ.73 లక్షలు స్వాహా చేశారు. కన్సల్టెన్సీ నిర్వాహకుడు హేమ రోహిత్‌తో పాటు మరికొందరు కలిసి ఈ మోసానికి పాల్పడ్డారని బాధితులు పేర్కొన్నారు.
శ్రీనగర్‌కాలనీలో కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న రోహిత్ దేశ వ్యాప్తంగా పేరున్న కాలేజీలలో ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ సీట్లు మేనేజ్మెంట్ కోటాలో బ్లాక్ చేశానని ప్రచారం చేసుకున్నాడు. ఇతని మాటలు నమ్మి చాలామంది సీట్ల కోసం తమ వద్దకు వచ్చే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నగదు రూపంలోనే డబ్బు తీసుకుంటాడు. ఆయా కాలేజీల వద్దకు తీసుకెళ్లి, విద్యార్థులను వారి తల్లిదండ్రులను కాలేజీ బయటే ఉంచి మీ సీటు ఖరారైందని, ఫలానా రోజున అడ్మిషన్ లెటర్ వస్తుందంటూ నమ్మించి మిగతా సొమ్ము తీసుకునేవాడు.
ఆ తరువాత సీటు ఎప్పుడొస్తుందో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేస్తే పట్టించుకునే వాడు కాదు. ఆ తరువాత మీకు సీటు నిర్ధారణ కాలేదని, మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తామంటూ నమ్మించేవాడు.అతడిచ్చిన చెక్కులు తీసుకొని బ్యాంకులో డిపాజిట్ చేస్తే అవి బౌన్స్ అయ్యాయి. ఇలా 29 మంది ఇప్పటి వరకు మోసానికి గురయ్యారని ప్రాథమికంగా తేలింది. ఈ మేరకు బాధితుల ఫిర్యాదుపై సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.