సిటీబ్యూరో, అక్టోబరు 1 (నమస్తే తెలంగాణ ) : జీహెచ్ఎంసీలో భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ సవాల్‌గా మారుతోంది. నగరం నలుమూలల నుంచి 3500 నుంచి 4వేల మెట్రిక్ టన్నుల నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఐతే వ్యర్థాలను జీడిమెట్ల, ఫతుల్లాగూడ, శంషాబాద్, తూంకుంట ప్రాంతాల్లోని సీఅండ్‌డీ (కన్స్ట్రక్షన్స్ అండ్ డీమాలిషన్)కి తరలించి రీ సైక్లింగ్ ద్వారా ఇసుక, కంకరా, పార్కింగ్ టైల్స్, ఫుట్‌పాత్ టైల్స్, పేవర్ బ్లాక్స్, కర్బ్స్టోన్లు, మ్యాన్‌హోల్ మూతలు ఉత్పత్తి చేస్తున్నారు.
ఒక్కో ప్లాంట్‌లో రోజూ 500 టన్నుల నిర్మాణ వ్యర్థాల ప్రాసెస్ చేసే వీలుంది. ఐతే తరలింపు ప్రక్రియ సజావుగా సాగడం లేదు. పాత ఇండ్ల స్థానంలో కొత్తగా నిర్మించే వారు పాత ఇంటి వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడే పడేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి వేళల్లో రోడ్ల వెంబడి, సర్వీస్ రోడ్లు, ఖాళీ స్థలాల్లో డంపింగ్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ అడపాదడపా జరిమానాలు విధిస్తున్న నిర్వహణ గాడిన పడడం లేదు.
భవన నిర్మాణాల వ్యర్థాలను రీ సైక్లింగ్ చేసి రీయూజ్ (పునర్ వినియోగం)లోకి తీసుకువచ్చేందుకు గానూ నగరం నలుమూలల జీడిమెట్ల, ఫతుల్లాగూడ, శంషాబాద్, తూంకుంటలో నాలుగు ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఒక్కో ప్లాంట్ నుంచి రోజుకు 500 మెట్రిక్ టన్నుల చొప్పున 2వేల మెట్రిక్ టన్నుల వ్యర్థాలను శుద్ధిచేస్తున్నారు. ఐతే గడిచిన కొన్ని నెలలుగా ఈ భవన నిర్మాణ వ్యర్థాల తరలింపు సజావుగా జరగడం లేదు..ముఖ్యంగా ప్రజల్లో అవగాహన కల్పించడంలో జీహెచ్ఎంసీ విఫలం చెందింది. వాస్తవంగా ఏదైనా
భవన నిర్మాణం, కూల్చివేతల తాలుకా వ్యర్థాల తరలింపులో భారీ స్థాయిలో ఐతే టోల్ ఫ్రీ నంబర్ 1800 120 1159లో, వాట్సాప్ నంబరు 9100927073లో చెబితే సంబంధిత ఏజెన్సీ వారు వచ్చి వారి వారి ప్లాంట్లకు తీసుకువెళ్తారు. జీహెచ్ఎంసీ నిర్దేశించిన రేటు ప్రకారం మెట్రిక్ టన్నుకు నిర్ణీత రేటును వసూలు చేస్తారు. చిన్న స్థాయిలో (లోడు కంటే తక్కువ) ఉన్న వ్యర్థాలను సంబంధిత మేస్త్రీ ఏదో చోటకు చేర్చి ఆ తర్వాత ఏజెన్సీకి అప్పగించి సంబంధిత నగదును మేస్త్రీ తీసుకుంటారు.
కానీ మేస్త్రీలకు ఏజెన్సీలకు, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయ లోపం ఉంటున్నది. ఈ నేపథ్యంలోనే చాలా వరకు ప్రాంతాల్లో యాజమానులు, మేస్త్రీలు ఖాళీ స్థలాలు, చెరువుల పక్కన, నాలాల పక్కన రాత్రికి రాత్రే డంపింగ్ చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో స్వచ్ఛ హైదరాబాద్ లక్ష్యంగా నీరు గారుతోంది. అడపా దడపా జీహెచ్ఎంసీ ఖాళీ స్థలాలు, నాలాలు, చెరువు పక్కన ఉన్న భవన నిర్మాణ వ్యర్థాలను ఒక చోటకు చేర్చేందుకు ఇటీవల కాలంలో 12 కలెక్షన్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
ఆయా ప్రాంతాల నుంచి సేకరించిన వ్యర్థాలను జీహెచ్ఎంసీ కలెక్షన్ పాయింట్లో డంపింగ్ చేస్తే అక్కడ నుంచి ఏజెన్సీ తీసుకువెళుతుంది. ఇందుకు దూరాన్ని బట్టి టన్నుకి రూ. 425 నుంచి రూ.456 వరకు తీసుకుంటున్నారు. నేరుగా ప్లాంట్‌కి సొంత వాహనాల్లో తరలిస్తే మెట్రిక్ టన్నుకి రూ.105 నుంచి రూ.114లు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు రూ. 7 కోట్లకు పైగా జీహెచ్ఎంసీ నుంచి బకాయిలు రావాల్సి ఉందని, సీ అండ్ డీ ప్లాంట్ల నిర్వహణ భారంగా మారుతుందని ఏజెన్సీలు జీహెచ్ఎంసీ అల్టిమేటం జారీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. సీఅండ్‌డీ ప్లాంట్ల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కూల్చివేసిన భవన నిర్మాణ వ్యర్థాలను ఇంటింటికీ వెళ్లి సేకరిస్తామని చెప్పిన జీహెచ్ఎంసీ ఆచరణలో మాత్రం నిర్వహణను గాలికి వదిలేసింది. ఫలితంగా ఎక్కడ చూసిన గుట్టలు, గుట్టలుగా పేరుకుపోయిన భవన వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. గత ప్రభుత్వం సీ అండ్ డీ ప్లాంట్లను ఏర్పాటు చేసి, సమర్థవంతంగా నిర్వహణ చేపట్టి ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది.
భవన వ్యర్థాల నుంచి లక్షల టన్నుల కొద్ది ఇసుక, కంకరను తయారు చేశారు. నాణ్యతకు ఢోకా లేని బంక మట్టి, దొడ్డు కంకర, సన్న కంకర, దొడ్డు ఇసుక, సన్న ఇసుక , లోహాలు, ఇతరత్రా ముడి వస్తువులుగా మార్చారు. వాటిలో సిమెంట్, సిమెంట్ ఇటుకలు, టైల్స్, పేవర్ బ్లాక్స్, ప్రీకాస్ట్ కాంక్రీటు గోడలు, సిమెంట్ దిమ్మెలు ఇతరత్రా పరికరాలు తయారు చేశారు. కానీ ప్రస్తుతం నిర్వహణ భిన్నంగా మారిందని అనడంలో ఎలాంటి సందేహం లేదని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు.