హైదరాబాద్: మహానగరంలో భవన నిర్మాణ రంగం ఒక్కసారిగా స్తంభించిపోయింది. తమ సుదీర్ఘకాల సమస్యలను పరిష్కరించాలంటూ గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు సమ్మె బాట పట్టారు. నగరవ్యాప్తంగా పనులన్నింటినీ నిలిపివేసి, ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామ పరశురాం రెడ్డి మాట్లాడుతూ.. కార్మికులు, కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము నేడు రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చిన కార్మికులు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ సైతం తమకు అనుకూలంగా ఉండాల్సింది పోయి, వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా వారు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఇందులో భాగంగా లేబర్ కార్డు కలిగిన ప్రతి సెంట్రింగ్ కార్మికుడికి ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే రూ.20 లక్షల రూపాయల ప్రమాద బీమా పరిహారం అందించాలని, అలాగే క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి కార్మికుడికి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తూ ఈఎస్ఐ (ESI) కార్డులను జారీ చేయాలని కోరారు. వీటితో పాటు సొంత ఇల్లు లేని పేద కార్మికులందరికీ ప్రభుత్వం తరఫున గృహ వసతి కల్పించాలని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లను ఆదుకునేందుకు వారికి వడ్డీ లేని రుణాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో నిర్మాణ ప్రాంతాల్లో సెంట్రింగ్ మెటీరియల్ విపరీతంగా దొంగతనాలకు గురవుతూ కాంట్రాక్టర్లకు భారీ నష్టాలు మిగులుస్తున్నాయని, కాబట్టి పోలీస్ శాఖ వీటిపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరారు.
ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే తమను చర్చలకు పిలవాలని, పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఒకవేళ ప్రభుత్వం కాలయాపన చేస్తే రాబోయే రోజుల్లో ఈ ఆందోళనలను మరింత ఉధృతం చేసి, పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుస్తామని వారు హెచ్చరించారు. ఈ భారీ నిరసన సమ్మె కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ దిల్సుఖ్నగర్ జోన్ చైర్మన్ చనిగల అర్జున్ గౌడ్, అసోసియేషన్ అధ్యక్షులు సామ పరశురాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి గణేష్ ముదిరాజ్, ప్రముఖ నాయకులు దడిగ బాబురావు మరియు వందలాది మంది కార్మికులు, కాంట్రాక్టర్లు పాల్గొని సంఘీభావం తెలిపారు.