సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): నిర్మాణ సంస్థలు విశ్వాసం కోల్పోకూడదని, బాధితులకు వైభవ్ నిర్మాణ సంస్థ నష్టపరిహారం చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సికింద్రాబాద్‌కు చెందిన కె.వీరేశం బోయిన్‌పల్లికి చెందిన వైభవ్ నిర్మాణ సంస్థ ద్వారా తన ఇంటిని నిర్మించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందంలో భాగంగా రూ.15లక్షల 25వేలు నిర్మాణ సంస్థకు చెల్లించాడు. ఇంటి యజమాని మొదటి అంతస్తును అద్దెకు ఇవ్వగా.. ఇంటి గోడలకు భారీగా పగుల్లు ఏర్పడి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో యజమానికి చెప్పగా, ఆయన నిర్మాణ సంస్థకు సమాచారం ఇచ్చి మరమ్మతులు చేపట్టాలని కోరారు. ఎన్నిసార్లు విన్నవించినా సదరు సంస్థ పట్టించుకోకపోవడంతో బాధితుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. కేసులోని అన్ని అంశాలను హైదరాబాద్ వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలు బి.ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సి.లక్ష్మీప్రసన్న, శాసనకోట మాధవిలతో కూడిన బెంచ్ పరిశీలించింది. న్యాయసూత్రాలకు విరుద్ధంగా నిర్మాణ సంస్థ వ్యవహరించిందని, ఇందుకు బాధితుడికి రూ.50వేలు 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది. ఖర్చుల కింద మరో రూ.15వేలు అందజేయాలని సూచించింది.