చిక్కడపల్లి, అక్టోబర్ 1: అన్ని వ్యవస్థలకు రాజ్యాంగమే మార్గనిర్దేశం అని సుప్రీంకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు అన్నారు. రాజ్యాంగాన్ని విధ్వంసం చేసే హక్కు పార్లమెంట్‌కు లేదని ఆయన వివరించారు. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్(ఏఐఎల్యూ)తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘రాజ్యాంగం- ప్రజలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నాగేశ్వరరావు ‘రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణాలను పునః పరిశీలించే’ అంశంపై మాట్లాడారు.
దేశంలో రాజ్యాంగం పదువుల్లో ఉన్న వారంతా రాజ్యాంగానికి లోబడి పనిచేస్తేనే ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి ఆలహాబాద్ హైకోర్టు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును ఆయన ఉదాహరిస్తూ కేశవానంద భారతి కేసులోని అంశాలను గుర్తుచేశారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత న్యాయవ్యవస్థపైనే ఉంటుందని తెలిపారు. ఐలు ఆధ్వర్యంలో ‘రాజ్యాంగం- ప్రజలు’ పేరుతో రూపొందించిన పుస్తకాన్ని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఐలు రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ, ఒడిశా హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.మురళీధర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి హైకోర్టు పూర్వ న్యాయమూర్తి టి. రజని, ఐలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పార్థసారధి, జి.విద్యాసాగర్, న్యాయవాది ఎం.వి.దుర్గాప్రసాద్, ఐలు మహిళా కమిటీ కన్వీనర్, సీహెచ్. శైలజ, ఎన్. వెంకటేశ్, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.