సిటీ బ్యూరో, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు కాంగ్రెస్ బాధితులు ఎన్నికల అధికారి కార్యాలయానికి వందలాదిగా తరలివచ్చారు. కాంగ్రెస్ మోసానికి బలైన అన్ని వర్గాల ప్రజలు భారీగా తరలివచ్చి నామినేషన్ వేశారు. అభ్యర్థులు, వారిని బలపరిచేందుకు వచ్చిన వారితో ఎన్నికల అధికారి కార్యాలయం ఆవరణ ఉదయం నుంచి అర్ధారాత్రి దాకా కిటకిటలాడింది. కాంగ్రెస్ ప్రభుత్వం మోసానికి బలైన ప్రతి వర్గం నుంచి నామినేషన్ వేసేందుకు తరలివచ్చారు. ట్రిపుల్ఆర్, ఫార్మా సిటీ బాధిత రైతులు, నిరుద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, మాల సంఘం, మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన బాధితులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
ఒక్కో వర్గం నుంచి పదుల సంఖ్యలో నామినేషన్లు వేశారు. వారందరినీ నిలువరించేందుకు భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. ఆర్వో కార్యాలయం పరిసరాల్లో భారీగా బారికేడ్లు పెట్టారు. దీంతో ఆ ప్రాంతం అంతా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎన్నికల అధికారి కార్యాలయం పరిసరాల్లో ఎవరిని కదిలించినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో చేసిన మోసం, నమ్మకద్రోహానికి నిరసనగానే నామినేషన్ వేస్తున్నట్లు చెప్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలతో పాటు తెలంగాణలోని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ మోసాలు తెలియజేయాలనే తాము బరిలో నిస్తున్నామని తేల్చి చెప్తున్నారు.