రవీంద్రభారతి, నవంబర్ 27:రిజర్వేషన్ల పెంపు విషయంలో బీసీలను నట్టేట ముంచిన కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాల్‌రాజ్‌గౌడ్ డిమాండ్ చేశారు. గురువారం బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్నగౌడ్, వివిధ కుల సంఘాల ప్రనిధులతో కలిసి ఆయన మాట్లాడారు.
బీసీలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలో బీసీ ద్రోహిగా మిగిలిపోతుందన్నారు. బీసీలు జనరల్ స్థానాలలో పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బీసీ ఉద్యమాన్ని నీరుగార్చిన సీఎం రేవంత్‌రెడ్డికి స్థానిక ఎన్నికల్లో బీసీ సమాజం తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు.. అంబాల నారాయణగౌడ్, ఎలికట్టే విజయ్కమార్గౌడ్, బి.శేఖర్, నెట్టు ధన్‌రాజ్, నాగభూషణం, యాదగిరి, బోయసంఘం నేత మీనుగ గోపి, సింగం నగేష్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఖైరతాబాద్, నవంబర్ 27 : రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రజా ఐక్య కూటమి ఆధ్వర్యంలో ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు ఎదురవుతున్న సవాళ్లు-పరిష్కారాలు, తదుపరి కార్యాచరణ’ అనే అంశంపై సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. బీసీలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా ఐక్య కూటమి చైర్మన్ దాసు సురేశ్, బీజేపీ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు గంధమల్ల ఆనంద్ గౌడ్, ఫార్మర్స్ రైట్స్ సంస్థ అధ్యక్షుడు వడ్డేపల్లి రామకృష్ణ, న్యాయ నిపుణులు మంజుల, ఆర్టీసీ జేఏసీ మాజీ చైర్మన్ దొంత ఆనందం, బహుజన సేన అధ్యక్షుడు తీగల ప్రదీప్ గౌడ్, ఉద్యమకారుల జేఏసీ నాయకులు వీరస్వామి, నగేశ్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు యూనివర్సిటీ, నవంబర్ 27: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్లు పెంచకుండా పంచాయతీ ఎన్నికలకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సైఫాబాద్‌లోని సామ్రాట్ కాంప్లెక్స్‌లో గురువారం నిర్వహించిన బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాల అత్యవసర సమావేశంలో మందకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజిర్వేషన్లు అమలు చేయలేని రాహుల్‌గాంధీ తెలంగాణ సమాజానికి ఏం సమాధానం ఇస్తాడని ప్రశ్నించారు. బీసీ జేఏసీ చేస్తున్న రిజర్వేషన్ల పోరాటానికి ఎమ్మర్పీఎస్ సంపూర్ణంగా మద్దతు పలుకుతుందన్నారు. బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీ ఉద్యమాన్ని ఆపేది లేదని.. ఈనెల 30న చేపట్టనున్న చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 42శాతం రిజర్వేషన్ ఇచ్చాకనే ఎన్నికలకు వెళ్తామని చెప్పిన మాట ఏమైదంని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీలు బీసీల ఆగ్రహానికి గురికాకతప్పదని జాజుల హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జకృష్ణ, బీసీ విద్యార్ధి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్‌గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు కనకాల శ్యామ్ కురుమ, బీసీ జేఏసీ కో చైర్మన్ ఉప్పరి శేఖర్ సగర, వీరస్వామి, వైస్ చైర్మన్ దీటి మల్లయ్య, యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వరికుప్పల మధు, బీసీ జేఏసీ కన్వీనర్ పెరిక సురేష్, డాక్టర్ రమేష్, మహిళా సంఘం నాయకురాల్లు సంధ్యారాణి, కె,సుజాత, ఇంద్రం రజక, భరత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.