Badangpet | బడంగ్పేట్, మార్చి 21 : బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్ఎస్ రెడ్డి కాలనీ, లక్ష్మీ నగర్ కాలనీల మధ్య ఉన్న రోడ్డు వివాదాస్పదంగా మారింది. ఎస్ఎస్ రెడ్డి నగర్ నుంచి లక్ష్మీ నగర్ పోవడానికి అధికారులు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయించారు. టెండర్ ప్రక్రియ కూడా పూర్తి అయింది. ఎస్ఎస్ రెడ్డి నగర్ నుంచి లక్ష్మీ నగర్ పోవడానికి రోడ్డు లేదంటూ కొంతమంది కాలనీవాసులు అధికారులను పనిచేయకుండ గత కొన్ని నెలల నుంచి సతాయిస్తున్నారు. ఇది డెడ్ ఎండ్ రోడ్ అంటూ ఎస్ఎస్ రెడ్డి నగర్ కాలనీవాసులు అడ్డుకుంటున్నారు. వీరికి మద్దతుగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు.
అధికారులు కొంత మేరకు పనులు చేసినప్పటికీ మిగతా పనులు చేయకుండా అడ్డుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. లింకు రోడ్డు వేస్తే తప్పేంటని అధికారులు పేర్కొంటున్నారు. రోడ్డు వేయకుండా అడ్డంగా గ్రానైట్ రాళ్లు పాతారు. దీంతో కాలనీలకు రాకపోకలు బంద్ అయిపోయాయి. శుక్రవారం అధికారులు రోడ్డు పనులు చేయడానికి వెళితే మరోసారి కాలనీలో ఉన్న కొంతమంది నాయకులు అడ్డుకున్నారు. రోడ్డు పనులు నిలిపివేయాలంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు అధికారులకు ఫోన్ చేసి పనులు ఆపేయాలని చెప్పడంతో అధికారులు పనులు చేయకుండా వెనుతిరిగారు.
రోడ్డు మూసేసి గత కొంత కాలం నుంచి రాకపోకలు బంద్ చేశారు. రోడ్డు వేయించాలని లక్ష్మీ నగర్ కాలనీవాసులు, రోడ్డు వేయొద్దని ఎస్ఎస్ రెడ్డి నగర్ కాలనీవాసులు పట్టుబడుతున్నారు. ఈ చిక్కుముడిని విప్పలేక అధికారులకు తలపానం తోకకొస్తుంది. అధికార పార్టీ నేతలు తల దూర్చడం వల్లనే సమస్య వివాద స్పదంగా మారినట్లు తెలుస్తుంది. అధికారులను పనిచేయకుండా ఆపడంతో అధికారులు వెనుతిరిగారు. పోలీస్ ప్రొటెక్షన్ తో రోడ్డు వేయించి తీరుతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. రెండు కాలనీల మధ్య రోడ్డు వివాదాస్పదంగా మారి ఆందోళనకు దారితీసింది.