మేడ్చల్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ పథకాల వర్తింపులో కాంగ్రెస్ నేతల జోక్యం అధికమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారికే పథకాల వర్తింపు చేయాలని అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో చేసేది లేక కాంగ్రెస్ నేతలు ఫైనల్ చేసిన లిస్టునే అధికారులు అర్హులుగా చేరుస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. హస్తం పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇల్లు పథకం, రేషన్‌కార్డుల జారీ, రాజీవ్ యువ వికాస పథకాలకు ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాము చెప్పినవారికే పథకాలు వర్తింపచేయాలని హస్తం పార్టీ నేతల ఒత్తిళ్లు అధికమయ్యాయంటూ అధికారుల్లో టాక్ నడుస్తోంది.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ పథకానికి 1.22 లక్షల దరఖాస్తులు రాగా రేషన్ కార్డుల కోసం 1.42 లక్షల దరఖాస్తులు, రాజీవ్ యువ వికాస పథకానికి 66 వేల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఇందిరమ్మ పథకానికి సంబంధించి అర్హుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ సభ్యులదే తుది నిర్ణయం కావడంతో వారు చెప్పిన వారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసేందుకు అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు. అలాగే తాము సూచించిన వారికే నూతన రేషన్ కార్డులు సైతం జారీచేయాలని కాంగ్రెస్ నేతలు హూకుం జారీ చేస్తున్నట్లు సమాచారం.
సమీక్షా సమావేశం వాయిదా..
ఈ క్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం నిర్వహించాల్సిన సమీక్షా సమావేశం వాయిదా పడింది. జిల్లాలో వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించనున్నారనే నేపథ్యంలో జిల్లా అధికారులంతా నివేదికలను సిద్ధం చేసి ఉంచారు. కారణాలు తెలియనప్పటికీ సమావేశం వాయిదా పడటం వెనుక పథకాల అమలులో నేతల ఒత్తిళ్లపై అధికారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందనే సమాచారం మేరకే మంత్రి సమావేశాన్ని వాయిదా వేశారనే విమర్శలు ఉన్నాయి.
హస్తం కార్యకర్తలకు అందలం..!
జిల్లాలోని మేడ్చల్ మున్సిపాలిటీకి సంబంధించి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింనకు సంబంధించి అర్హులను కాదని కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి పేర్లను లిస్టులో చేర్చారని ఇటీవల పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందడంతో.. ఈ విషయమై విచారణ చేస్తామని చెప్పిన అధికారులు తర్వాత ప్రభుత్వ పెద్దల జోక్యంతో లిస్టుపై ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ పథకంలో ఇప్పటివరకు ఎంపిక చేసిన 1,479 మంది లబ్ధిదారుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలకే మెజార్టీ ఇళ్లు మంజూరైనట్లు ఆరోపణలున్నాయి. ఇలా ఇందిరమ్మ పథకం విషయంలోనే కాకుండా రాజీవ్ యువవికాసం, రేషన్ కార్డుల జారీలోనూ అధికార పార్టీ నేతల జోక్యం ఎక్కువైపోయిందనే విమర్శల నేపథ్యంలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.