BRS | సిటీబ్యూరో/మేడ్చల్ సెప్టెంబర్ 13 ( నమస్తే తెలంగాణ ):‘ఇందిరమ్మ రాజ్యం’లో ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చేలా శుక్రవారం తెల్లవారుజాము నుంచే బీఆర్ఎస్ ముఖ్యనేతలు, కార్యకర్తల ముందస్తు అక్రమ అరెస్టులు.. గృహనిర్బంధాలతో గ్రేటర్లో పోలీసుల నిర్బంధకాండ కొనసాగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై ఎమ్మెల్యే గాంధీ, ఆయన అనుచరులు చేసిన దాడికి నిరసనగా ‘బీఆర్ఎస్’ చేపట్టిన కార్యాచరణను భగ్నం చేస్తూ..ఆపార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడే నిర్బంధించి.. పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు.
అరెస్టులపై ఆగ్రహించిన బీఆర్ఎస్ శ్రేణులు పలు చోట్ల నిరసనలకు దిగారు. కాంగ్రెస్ ప్రభుత్వ దమననీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు నిర్బంధాలు, అరెస్టులు కొత్తేమీ కాదని ఎలుగెత్తారు. ఇలాంటి నిర్బంధాలు ఉద్యమ సమయంలోనూ చూడలేదని తెలంగాణవాదులు పేర్కొన్నారు. అలాగే గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. ముందస్తు అరెస్టులతో వారిని బయటకు వెళ్లనీయకుండా భారీగా బలగాలను మోహరించారు.
ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు గౌడ్, చామకూర మల్లారెడ్డి, వివేకానంద్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాగంటి గోపీనాథ్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ నేతలు రాగిడి లక్ష్మారెడ్డిలను వారి ఇండ్ల వద్దే నిర్బంధించారు. అలాగే బీఆర్ఎస్ కార్పొరేటర్లు జగన్, మీనా ఉపేందర్‌రెడ్డి, లావణ్యాశ్రీనివాస్గౌడ్, విజయ్‌కుమార్‌గౌడ్, పద్మావెంకటరెడ్డి, వెల్దండ వెంకటేశ్, దేదీప్య, ప్రసన్నలక్ష్మి, హేమ , శైలజ, సునీత, గీతాప్రవీణ్ ముదిరాజ్, శాంతిసాయిజెన్ శేఖర్, దేవేందర్‌రెడ్డి, ప్రభుదాస్‌లను అరెస్టు చేసి సంబంధిత పోలీస్స్టేషన్లకు తరలించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారెంటీలను ఇవ్వలేకనే దౌర్జన్యాలకు పాల్పడుతున్నది. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై దాడి చేస్తుంటే పోలీసు వ్యవస్థ ఏం చేస్తున్నది. కాంగ్రెస్ పాలన గాడి తప్పింది. ప్రజలు గమనిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు.
– మాజీ మంత్రి మల్లారెడ్డి