మహానగరం నిషేధిత జాబితాలో చేరిపోయింది. 22-ఏ రాక్షస కోరల్లో చిక్కుకుని విలవిలలాడుతోంది. గ్రేటర్ వ్యాప్తంగా లక్షలాది ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వ చర్యలతో జనాలు వణికిపోతున్నారు. జీవితకాలం రెక్కల కష్టాన్ని ఒక్క రాత్రిలో ప్రశ్నార్థకం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ వంటి సంస్థల అనుమతులు పొంది..నిత్యం పన్నులు కట్టిన ఆస్తులకే రక్షణ లేకుండా చేసిన కాంగ్రెస్ చర్యలతో గ్రేటర్ వ్యాప్తంగా ఇండ్లు, ప్లాట్లు, అపార్టుమెంట్ల భవితవ్యం గందరగోళంగా మారింది. దాదాపు 16 మండలాల్లోనే లక్షకు పైగా ఆస్తులు నిషేధిత రాక్షస కోరల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘నమస్తే’తెలంగాణ సమగ్ర కథనాలను గణాంకాలతో ప్రచురించింది. నిషేధిత జాబితా మాటున కాంగ్రెస్ చేసిన కుట్రలను బట్టబయలు చేసింది. జనాలను అప్రమత్తం చేస్తూ … జరగబోయే పరిణామాలను పూసగుచ్చినట్లుగా వివరించింది. ప్రజల ఆగ్రహంతో సర్కార్‌పై ఒత్తిడి పెరిగి.. తర్జనభర్జనలు పడుతోంది. నెపాన్ని అధికారులపై నెట్టిన ప్రభుత్వం.. సమస్యను పరిష్కారిస్తామంటూ ప్రజలను మభ్యపెడుతున్నది.
– సిటీబ్యూరో

సిటీ బ్యూరో, ఆగస్టు 17 తెలంగాణ) :విలువైన భూములే లక్ష్యంగా హైదరాబాద్ కేంద్రం ఉన్న ఆస్తులపై కన్నేసిన కాంగ్రెస్ గద్దలు… రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలతో కలిసి నిషేధిత చట్టాన్ని జనాలపై ప్రయోగించారు. అన్ని అనుకున్నట్లుగా జరగడంతోపాటు, కన్నేసిన అసైన్డ్, ప్రభుత్వ, వివాదస్పద భూములతోపాటు, దశాబ్ధాల కిందటే కొనుగోలు చేసి, అనుభవిస్తున్న ప్రైవేటు ఆస్తులు కూడా ఈ జాబితాలో చేరడంతో జనాలు గగ్గోలు పెట్టారు. దీంతో నాలుక కరుచుకునేలా సర్కార్ చేసిన తప్పిదాన్ని లేవనెత్తుతూ ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలను ప్రచురించింది. నిషేధిత జాబితా మాటున కాంగ్రెస్ చేసిన కుట్రలను బట్టబయలు చేస్తూ.. హైదరాబాద్ వ్యాప్తంగా సమగ్ర కథనాలను గణాంకాలతో ప్రచురించింది. జనాలను అప్రమత్తం చేస్తూ … జరగబోయే పరిమాణాలను పూసగుచ్చినట్లుగా వివరించింది. అసలు నష్టాన్ని గ్రహించిన జనాలు బయటపడటంతో… సర్కార్‌పై ఒత్తిడి పెరిగి తర్జనభర్జనలు పడుతోంది. దీంతో నెపాన్ని అధికారులపై నెట్టిన ప్రభుత్వం… సమస్యను పరిష్కారిస్తామంటూ మభ్యపెడుతున్నది.
కీలక ప్రాంతాలపై నిషేధాజ్ఞలు…
రియల్ ఎస్టేట్ రంగానికి గుండె కాయ లాంటి హైదరాబాద్ వ్యాప్తంగా ప్రధాన ఆర్థిక కేంద్రాలు, కీలకమైన వాణిజ్య కేంద్రాలు ఉన్నాయి. కాంగ్రెస్ జాబితాలో లక్షకు పైగా నిర్మాణాలు ఉండగా… బ్యాంకింగ్ లావాదేవీలు నిలిచిపోయాయి. ఇక మేడ్చల్ జిల్లాలో 511 ఫిర్యాదులు, రంగారెడ్డి పరిధిలో 148, హైదరాబాద్ పరిధిలో పదుల సంఖ్యలో ఫిర్యాదులు ఉన్నా… అనధికారికంగా అంతకు మించి జనాలు ఇబ్బంది పడుతున్నారు. వీటన్నింటిలో వేల కోట్లు విలువ చేసే భూములు, ఖాళీ జాగాలు ఇప్పటికీ పలు వివాదాలతోపాటు, రెవెన్యూ సమస్యలతో ఇరుక్కుని ఉన్నాయి. వీటన్నింటిని కాజేసే కుట్రలో భాగంగానే నిషేధిత జాబితాను తెరమీదకు తెచ్చిన సర్కారు… నగరంలోని అత్యంత కీలకమైన బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ వంటి వరల్డ్ క్లాస్ కమర్షియల్ హబ్‌లోని భూములను ప్రశ్నార్థకం చేసింది.
ఇక్కడ ఉండే కమర్షియల్, రెసిడెన్షియల్ సముదాయాలతోపాటు, ప్రాముఖ్యత కలిగిన గేటేడ్ కమ్యూనిటీలు, కాలనీలను కూడా నిషేధించింది. దశాబ్దాల చరిత్ర కలిగిన నివాస ప్రాంతాల్లో కొనుగోలుదారులు ఆస్తులు అమ్మాలన్నా… తాకట్టు పెట్టుకునే వీల్లేకుండా రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిపివేసింది. గచ్చిబౌలి నుంచి మొదలుకుని ఉప్పల్ వరకు, అమీర్‌పేట, శ్రీనగర్ కాలనీ, ఎస్ఆర్ నగర్, హిమయత్ నగర్, పటాన్చెరు, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, కూకట్పల్లి వంటి నియోజకవర్గాల్లోని పలు రెవెన్యూ గ్రామాల్లోని సర్వే నంబర్లను నిషేధిత జాబితాలో చేర్చి వేలాది నివాసాలపై భూ యజమానులకు హక్కులే లేకుండా చేసింది. ఈ క్రమంలో ఎర్రగడ్డలోని వాసవి, జనప్రియ, కల్పతరు, బ్రిగేడ్ సిటాడెల్ వంటి భారీ రెసిడెన్షియల్ కాంప్లెక్సులతోపాటు, యూసుప్గూడలోని కళ్యాణ్ నగర్ సోసైటీ, గుట్టల బేగంపేట్‌లోని పలు కాలనీలు, ఉప్పల్‌లోని స్వరూప్‌నగర్‌లోని పదుల ఎకరాల్లో విస్తరించి ఉన్న నివాస సముదాయాలు కాంగ్రెస్ కోరల్లో చిక్కుకోవడంతో లబోదిబోమంటున్నారు.

రాక్షస కోరల్లో జనాలు కుదేలు…
దశాబ్దాల కష్టార్జితాన్ని కాలరాసేలా కాంగ్రెస్ సర్కారు చర్యలతో జనాలు కుదేలవుతున్నారు. రాక్షస కోరల్లో చిక్కుకుని రిజిస్ట్రేషన్ శాఖకు పన్నులు చెల్లించి, కొనుగోలు చేసిన ఆస్తులు రాత్రికి రాత్రే 22-ఏ జాబితాలోకి వెళ్లడంపై సామాన్యుడు దిక్కుతోచక అల్లాడుతున్నారు. ఉప్పల్ స్వరూప్ నగర్ వంటి ప్రాంతాల్లో బిడ్డ పెళ్లి కోసమనీ, అత్యవసర వైద్య ఖర్చులకు కూడా అమ్ముకునే వీల్లేకుండా చేసిన చర్యలతో జనాలు బెంబేలెత్తిపోతున్నారు. పెళ్లిళ్లు ఆగిపోయి, కుటుంబాలు రోడ్డున పడేసేలా సర్కార్ వ్యవహారం ఉందనే ఆందోళన వ్యక్తమవుతున్నది..