ఘట్కేసర్ రూరల్, నవంబర్ 10: ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వచ్చి ఓట్లడిగే పార్టీలను తరిమికొట్టాలని మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రజలకు సూచించారు. మండల పరిధి ప్రతాపసింగారంలో శుక్రవారం రాత్రి జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొని మాట్లాడారు. అధికార కాంక్షతో కాంగ్రెస్ పార్టీ నీతినియమాలు తప్పిందని, అనేక అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం లేదని, స్వార్థపూరిత రాజకీయాలు చేసే నాయకులకు పతనం తప్పదన్నారు.
దేశం లో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని చెప్పా రు. ఉచిత విద్యుత్‌పై అక్కసు కక్కిన కాంగ్రెస్ పార్టీ రైతులను ఓట్లు అడిగే హక్కును కోల్పోయిందన్నారు. వృద్ధులకు పెద్ద కొడుకుగా, యువతకు అన్నగా కేసీఆర్ ఆదుకుంటున్నాడని చెప్పారు. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి వృద్ధ్దుల వరకు తెలంగాణ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్‌సిటీ చైర్మన్ భద్రారెడ్డి, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు వెంకటేశ్ గౌడ్, ప్రతాపసింగారం సర్పంచ్ శివకుమార్, చౌదరిగూడ సర్పంచ్ బైరు రమాదేవి రాములు గౌడ్, మాజీ సర్పంచ్ రాములు గౌడ్, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి కొండల్ రెడ్డి, అయా గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.