సిటీబ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాయువేగంతో చేపట్టిన ఎస్ఆర్డీపీ పనులపై కాంగ్రెస్ గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిన వాటికి సున్నాలేసి రిబ్బన్ కటింగ్లు చేశారే తప్ప నిర్మాణంలో ఉన్న వంతెనలు, ఆర్వోబీ, ఆర్యూబీల పురోగతిని సమీక్షించలేదని ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శించారు.
ఫలక్నుమా ఆర్వోబీని పట్టించుకునే పరిస్థితి లేదని, శాస్త్రీపురం ఆర్వోబీ పనులు నిలిచిపోయాయన్నారు. ప్రతిపక్షాల మీద అక్రమ కేసులు పెట్టి చంచల్గూడ జైలుకు పంపే శ్రద్ధ .. ఫ్లై ఓవర్లను పూర్తి చేయడంపైన లేదన్నారు. కాంగ్రెస్ అంటే కమీషన్లు దండుకోవడం, కబ్జాలు చేసుకోవడం కక్ష తీర్చుకోవడమేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అభివృద్ధి అంటే భూములను చెరబట్టడం, బుల్డోజర్లను ఉసిగొల్పడం కాదు అని కేటీఆర్ ధ్వజమెత్తారు.