సిటీబ్యూరో, నవంబరు 21 (నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వ విధానపరమైన లోపాలు , జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం వెరసి..బల్దియా ఖజానాపై తీవ్ర భారం పడుతుంది..నిర్ణీత సమయంలో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను ఏళ్ల తరబడి సాగదీసి…అంచనా వ్యయాలను పెంచేస్తున్నారు. పనుల ప్రారంభానికి ముందున్న అంచనాలు..పూర్తయ్యే నాటికి ఉండడం లేదు. ప్రతి ప్రాజెక్టులో 20 నుంచి 38 శాతం పెరుగుదల కనిపిస్తున్నది. తాజాగా నల్గొండ క్రాస్ రోడ్ నుంచి సైదాబాద్, ఐఎస్ సదన్ ఒవైసీ జంక్షన్ కారిడార్ వరకు 2. 53 కి.మీల మేర రూ. 523.37 కోట్లతో నిర్మించ తలపెట్టిన స్టీల్ వంతెన పనులకు 2020 జూలైలో అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
ఈ ప్రాజెక్టు 2024 మే నాటికల్లా పూర్తి చేయాల్సి ఉంది..కానీ ఏళ్ల తరబడి ఈ పనులు నత్తకు నడకలు నేర్పుతుండడంతో స్టీల్, ఇతర ధరల పెరుగుదల దృష్ట్యా రూ. 523.37 కోట్ల ప్రాజెక్టు .. వ్యయాన్ని రూ. 620కోట్లకు పెంచేశారు. దీంతో జీహెచ్ఎంసీ ఖజానాపై అదనంగా రూ. 96.63కోట్ల భారం పడింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ప్రాజెక్టు పనులు 65 శాతం మాత్రమే పూర్తి చేసుకోగా..వచ్చే మే నాటికల్లా ప్రాజెక్టు పూర్తికి లక్ష్యంగా ఖరారు చేశారు. ఈ క్రమంలోనే స్టీల్ ధరలు పెరిగాయన్న సాకుగా చూపి మరో రూ.100 కోట్ల మేర అదనపు భారం మోపేందుకు ప్రాజెక్టు విభాగం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇదే జరిగితే అధికారుల రెండేళ్ల నిర్లక్ష్యం ఖరీదు దాదాపు రూ.196 కోట్లు ప్రజలపై భారం మోయక తప్పని పరిస్థితి.
ఆర్టీసీ క్రాస్‌రోడ్ స్టీల్ బ్రిడ్జికి రూ. 139 కోట్ల అంచనా వ్యయం పెంచినట్లుగానే నల్గొండ క్రాస్‌రోడ్ స్టీల్ బ్రిడ్జి ప్రాజెక్టుకు ఇష్టారీతిలో ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతుండడం పట్ల అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఉప్పల్ జంక్షన్ ఫ్లై ఓవర్ రూ. 311 కోట్లతో చేపట్టగా, ప్రాజెక్టు పూర్తి అయ్యే నాటికి మరో 30 శాతం మేర అదనంగా భారం ఖజానాపై పడే అవకాశాలు లేకపోలేదు. జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగంలో టెండర్ల పిలుపు నుంచి సంబంధిత ప్రాజెక్టు పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయలేకపోతున్నారు. సీఈ నుంచి ఎస్ఈలను అదనపు బాధ్యతల భారాన్ని తగ్గించి ఇంజినీరింగ్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలని, ఈ దిశగా కమిషనర్ కర్ణన్ చొరవ తీసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నల్గొండ క్రాస్‌రోడ్ నుంచి ఒవైసీ జంక్షన్ వరకు నిర్మిస్తున్న స్టీల్ వంతెన వ్యయం భారీగా పెరుగుతూ అరకొరగా పనులను కొనసాగుతుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటూ ట్రాఫిక్ సుడి గుండంలో చిక్కుంటున్నారు. చంచల్ గూడ చౌరస్తా నుంచి సైదాబాద్ వెళ్లే మార్గంలో హోటళ్లు, దుకాణాలు ఉండి రోడ్డు ఇరుకుగా మారడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ రద్దీతో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు వర్ణణాతీతం. నాలుగు కిల్లో మీటర్ల ప్రయాణం నరకయాతనగా వాహనదారులు భావిస్తున్నారు.
నాగార్జునసాగర్ రాష్ట్రీయ రహదారి కావటంతో నిత్యం వేలాది బస్సులు, వాహనాలు ఇతర జిల్లాలకు వెళ్లేందుకు ప్రధాన మార్గం కావటంతోపాటు శంషాబాద్ విమానాశ్రయం, శ్రీశైలం, కేంద్ర రక్షణ రంగ కార్యాలయాలకు వెళ్లే వారందరూ నిత్యం ట్రాఫిక్ అంతరాయం కలుగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా సైదాబాద్ ఏసీపీ ఆఫీస్ సమీపంలోని పురాతన హనుమాన్ మందిరంపై వెళ్లే బ్రిడ్జి నిర్మాణ అలైన్మెంట్లో మార్పులు చేస్తేనే పనులను జరుగుతాయని, లేకుంటే అడ్డుకొని తీరుతామని హెచ్చరించిన నేపథ్యంలో వివాదానికి దారితీయటంతో పనులు స్తబ్ధతగా కొనసాగుతున్నాయి.
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంలో భాగంగా గత కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా రూ.5937కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 42 ఫ్లై ఓవర్లలో 37 చోట్ల పనులు వాయువేగంతో పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. బీఆర్ఎస్ హయాంలోనే 95 శాతం మేర పురోగతి లో ఉన్న పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో సకాలంలో పూర్తి చేసుకోలేక పోతున్నాయి. తుది దశలో ఉన్న ప్రాజెక్టులను మాత్రం కాంగ్రెస్ సర్కారు నాలుగు చోట్ల ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎల్బీనగర్ బైరామల్ గూడ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్, కుడివైపు లూప్ కవర్, ఎడమ వైపు లూప్ ఫ్లై ఓవర్లతో పాటు జూపార్కు నుంచి ఆరాంఘర్ వరకు చేపట్టిన ఫ్లై ఓవర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫలక్‌నుమా, శాస్త్రీపురం ఆర్వోబీలతో పాటు ఉప్పల్ ఫ్లై ఓవర్ పనులను సకాలంలో పూర్తి చేయడంలో విఫలం చెందింది.