బడంగ్పేట్, నవంబర్ 22: కందుకూరు గురుకులంలోని సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్‌గూల్‌లో ఉన్న కందుకూరు గురుకులాన్ని ఆమె శనివారం సందర్శించారు. అద్దెభవనంలో నడుస్తున్న గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు కనీస సౌకర్యలు లేవని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చలి తీవ్రత ఎక్కువగా ఉందని తెలిసి కూడా కిటికీలు, తలుపులు అమర్చకపోవడంపై ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. తరగతి గదులు అపరిశుభ్రంగా ఉన్నాయని, అసలు ఊడ్చేవారు ఉన్నారా లేరా? అని ప్రశ్నించారు. ఇంత దారుణంగా ఉంటే అధికారులు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిలదీశారు. విద్యుత్ వైర్లు నేలపైన ఉండటం వల్ల విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉందన్నారు.
‘మీ పిల్లలు అయితే ఇలానే ఉంచుతారా?’ అని ఆమె ప్రశ్నించారు. గదులు అపరిశుభ్రంగా ఉంటే విద్యార్థులకు అంటువ్యాధులు రాకుండా ఉంటాయా అన్నారు. ఎక్కడ చూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయన్నారు. వారం రోజుల్లో సమస్యలను పరిష్కరించాలని భవన యజమానికి, అధికారులకు ఆమె సూచించారు. సమస్యలు చెప్పకుండా ముందే విద్యార్థులను భయపెట్టడం ఏమిటని ప్రశ్నించారు. సమస్యలు ఉన్నట్లు విద్యార్థుల ముఖంలోనే తెలుస్తుందన్నారు. విద్యార్థులు సమస్యలు చెప్పకుండా అధ్యాపకులు ముందే బెదిరించిన్నట్లు తెలుస్తుందన్నారు. అందుకే విద్యార్థులు ఎవరూ నోరు మెదపడంలేదన్నారు. 600 మంది విద్యార్థులు చదువుకునే గురుకులం సమస్యల వలయంలో చిక్కుకుందన్నారు. వారం రోజులలో సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
కందుకూరు గురుకుల కళాశాలలో విద్యార్థులు నేలపైన కూర్చొని చదువు కొనసాగిస్తునారు. విద్యార్థులను నెలపై కూర్చోబెట్టడంపై ఎమ్మెల్యే చల్లించిపోయారు. ఇదేం పద్ధతి, ఇంటర్ విద్యార్థులను నేలపై కూర్చోబెట్టడం పద్ధతి కాదన్నారు. విద్యార్థులతోపాటు ఎమ్మెల్యే నేలపైనే కూర్చొని విద్యార్థులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. గురుకుల కళాశాలలో విద్యార్థుల సంఖ్య గనీయంగా తగ్గడానికి గల కారణాలు ఏమిటని ఆమె అధ్యాపకులను అడిగారు. గతంలో గురుకుల కళాశాల, పాఠశాలల్లో సీట్లు దొరికేవి కాదన్నారు. ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఆరా తీశారు.
నాదర్‌గూల్‌లో ఉన్న కందుకూరు గురుకుల పాఠశాల, కళాశాలలో విద్యార్థులకు దొడ్డు బియ్యంతో భోజనం పెడుతున్నారని ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి గుర్తించారు. విద్యార్థులకు తయారు చేసిన భోజనాన్ని ఆమె పరిశీలించారు. దొడ్డు బియ్యంతో వండటం వల్లనే అన్నం ముద్ద అయిందన్నారు. సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని ఓ పక్క ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే, నేటికీ గురుకులాల్లో దొడ్డు బియ్యంతోనే భోజనం పెడుతున్నారని ఆమె విమర్శించారు. సన్నబియ్యంతో భోజనం పెడుతున్నామని చెప్పేవారు గురుకుల హాస్టల్‌కు వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. విద్యార్థులకు నాసిరకమైన భోజనం పెడుతున్నారని ఆమె మండిపడ్డారు.
కందుకూరు గురుకులంలో ఉన్న సమస్యలను పరిశీలించడానికి ఎమ్మెల్యే వస్తున్నారని ముందే తెలుసుకొని గేటుకు తాళం వేశారు. పది నిమిషాలు అయినా గేటు తాళం తీయకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు గేటు పైకి ఎక్కి గేటు తీశారు. గేటుకు ఎందుకు తాళం వేశారని జోనల్ అధికారి లక్ష్మి అంజలి దేవిని, ఇన్చార్జి ప్రిన్సిపల్ శ్రీకాంత్ పై ఎమ్మెల్యే అగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులను సైతం లోపలికి ఎందుకు రానివ్వడం లేదన్నారు. హాస్టల్లో ఉన్న సమస్యలు తెలుస్తాయన్న ఉద్ధేశంతో రానివ్వడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు వివరించారు. గురుకులంలో ఉన్న సమస్యలను విద్యార్థుల తల్లిదండ్రులు సెల్ఫోన్లో ఫొటోలు తీసి ఎమ్మెల్యేకు చూపించారు. గురుకులంలో ఉన్న సమస్యలను చూసి ఎమ్మెల్యే చలించిపోయారు. ఇంత దారుణంగా ఉంటే ఎవరు పట్టించుకోక పోతే ఎలా అని మండి పడ్డారు.
మున్సిపల్ కమిషనర్ ఎందుకు పట్టించుకోవడం లేదు?
నాదర్‌గూల్ గురుకుల హాస్టల్లో ఉన్న సమస్యలను బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఎందుకు పట్టించుకోవడం లేదని కమిషనర్ సరస్వతికి ఎమ్మెల్యే ఫోన్ చేసి మందలించారు. డ్రైనేజీ, మంచి నీరు, పారిశుధ్య సమస్యలతో విద్యార్థులు అవస్థలు పడుతుంటే అధికారులు ఎవరు పట్టించుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. గురుకులం సమస్యలపై ఆ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో డ్రైనేజీ లేదంటే రూ.20లక్షలు కేటాయించి డ్రైనేజి వేయించామని, అద్దె ఇస్తున్నా సమస్యలను పరిష్కరించకపోవడం పట్ల భవన యజమానిపై ఆమె అగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో డ్రైనేజీ, గదులకు కిటికీలు, డోర్లు వేయించాలన్నారు. పారిశుధ్యం లోపించకుండడా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గురుకుల పాఠశాలలో మురికి గుంటలుగా ఉంటే విద్యార్థులు ఎలా చదువుకుంటారన్నారు. విద్యార్థుల మౌలిక మస్యలపై అధికారులు దృష్టి సారించాలన్నా రు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యెల్చల సుదర్శన్‌రెడ్డి, బీమిడి జంగారెడ్డి, బోయపల్లి శేఖర్‌రెడ్డి, జంగయ్య, శ్రీరాములు, కొండల్ రెడ్డి, రవి తదితరులు ఉన్నారు.
‘కందుకూరు గురుకులంలో కంపు’ అనే కథనం శనివారం ప్రచురితం కావడంతో అధికార యంత్రాంగం కదిలింది. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న నాదర్‌గూల్ గురుకుల పాఠశాల, కళాశాలలలో నెలకొన్న సమస్యలపై కథనం రావడంతో పై అధికారుల ఆదేశాల మేరకు జోనల్ ఆఫీసర్ లక్ష్మి అంజలిదేవి ఉదయం గురుకులాన్ని సందర్శించి సిబ్బందితో పనులు చేయించారు. చెత్త చెదారంతో నిండిపోయిన వాటిని తొలగించారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వస్తున్నారన్న విషయం తెలియడంతో అదనపు సిబ్బందిని పెట్టి పారిశుధ్యం పనులు చేయించారు. మురుగు నీటిలో బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. పాఠశాలలో ఉన్న సమస్యలు బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రతలు తీసుకున్నారు. మంచినీటి ట్యాంక్‌లను శుభ్రం చేయించారు. వారం రోజులలో కిటికీలు, తలుపులు, అద్దాలు అమర్చుతామని అధికారులు పేర్కొన్నారు. డ్రైనేజీ లైన్ వేయిస్తామన్నారు. సమస్యలు లేకుండా చూసుకుంటామని ఎమ్మెల్యేకు వివరించారు.