హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తేతెలంగాణ) : కాంగ్రెస్ పాలనలో భవన నిర్మాణ కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ధ్వజమెత్తారు. కార్మికుల కష్టార్జితమైన బోర్డు నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్టీయూ అనుబంధ సంఘం తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్రస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశానికి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేసీఆర్ పాలనలో భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యమిచ్చామని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రా పాలకులు అక్రమంగా తీసుకెళ్లిన బోర్డును కొట్లాడి తీసుకొచ్చామని గుర్తుచేశారు.
కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ఇందిరమ్మ బీమా, అధునాతన శిక్షణ కేంద్రం పేరుతో రూ. 1200 కోట్లు దారి మళ్లీంచిందని ఆరోపించారు. కార్మికులకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోబోదని వారి తరుఫున పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ..భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మికుల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటామని భరోసానిచ్చారు. రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్ నారాయణ మాట్లాడారు. కాంగ్రెస్ నేతల అరాచకాలపై కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల మారయ్య, హమాలీ శ్రీనివాస్, పాలడుగు రాఘవులు, మల్లేశ్, రమేశ్, ప్రభాకర్, రాజు, హరీశ్, రాజశేఖర్, చెన్నయ్య, సుధాకర్, గణేశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.