మణికొండ, జూలై 8: విధులు నిర్వహిస్తున్న జలమండలి లైన్‌మన్‌పై కాంగ్రెస్ కార్పొరేటర్ విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఈ ఘటన నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. కోకాపేట ప్రాంతానికి చెందిన పెసరి శ్రీధర్ జలమండలి మణికొండ డివిజన్లో నీటి సరఫరా లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. కోకాపేటలోని అక్షయ పాత్ర సమీపంలో నీటిని విడుదల చేసేందుకు వెళుతుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన 5వ వార్డు కౌన్సిలర్ శివారెడ్డి అడ్డుకొన్నాడు. రాజీవ్ గృహకల్పకు వాటర్ ఎందుకు సరఫరా చేయడం లేదంటూ ప్రశ్నించాడు. ఆ ఏరియా తన పరిధిలోకి రాదని, మరో లైన్‌మ్యాన్ సరఫరా చేస్తాడని చెప్పాడు. అయినా.. శ్రీధర్ మాట వినకుండా శివారెడ్డి బలవంతంగా తన వాహనంపై ఎక్కించుకునేందుకు ప్రయత్నించాడు. శ్రీధర్ వాహనం ఎక్కకపోవడంతో చెంపపై కొట్టాడు. అనంతరం తన అనుచరులకు ఫోన్ చేసిన శివారెడ్డి మరో 10 మందిని అక్కడికి రప్పించుకున్నాడు. వారంతా బైక్‌లపై వచ్చి శ్రీధర్‌ను విచక్షణా రహితంగా చితకబాదారు. ఈ ఘటనలో శ్రీధర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం శ్రీధర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నార్సింగ్ పోలీసులు తెలిపారు.