సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): యూసుఫ్‌గూడ చెక్‌పోస్టు నుంచి రహ్మత్‌నగర్ ప్రధాన రహదారిలో ప్రమాదకరమైన మూల మలుపు ఉంది. దానిని 80 అడుగుల రహదారిగా విస్తరించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా 2012(ఉమ్మడి రాష్ట్రం)లో రోడ్డు విస్తరణకుగాను 15 ఆస్తులను సేకరించి వారికి నిబంధనల మేరకు కోట్లాది రూపాయల పరిహారాన్ని చెల్లించింది. సుమారు 300 మీటర్ల మేర పూర్తి కావాల్సిన విస్తరణ కేవలం ఈ మూల మలుపు దగ్గర మాత్రం అంతే ఇరుకుగా ఉంది.
అందుకు కారణం.. ఆ మలుపు వద్ద ప్రస్తుతం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ నివాసం ఉండటమే. 15 ఆస్తుల్లో కేవలం నవీన్ కుటుంబం మినహా మిగిలిన వారంతా పరిహారం తీసుకున్నందుకు స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చారు. అయితే నవీన్ కుటుంబం మాత్రం స్థలాన్ని ఇచ్చేందుకు పరిహారం తీసుకున్నప్పటకీ.. పూర్తి స్థలం ఇవ్వకుండా వ్యవహారాన్ని న్యాయ చిక్కుల్లో ఇరికించింది. చివరకు జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు లోతుగా విచారణ చేసి.. 134 చదరపు గజాల్లో నవీన్ కుటుంబం ఇల్లు కబ్జాలో ఉందని తేల్చారు. ఒకవైపు ఆ రోడ్డులో నిత్యం ట్రాఫిక్ జామ్‌తో లక్షల మంది వాహనదారులు ఇబ్బంది పడుతున్నా పరిహారం తీసుకున్న నవీన్‌యాదవ్ కుటుంబం మాత్రం స్థలాన్ని విడవటంలేదు. మరి.. ప్రజలకు సేవ చేస్తానంటున్న సదరు నవీన్ యాదవ్ ప్రజాసేవ ఇదేనా? అని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు.
న్యాయ చిక్కుల్లో ఇరికించి..
ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ రహదారిని విస్తరించేందుకు జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు సుమారు 300 మీటర్ల మేర రోడ్డువిస్తరణ కోసం 15 మందికి చెందిన ఆస్తులను సేకరించేందుకు నిర్ణయించి.. నోటిఫికేషన్ జారీ చేశారు. చివరకు తెలంగాణ రాష్ట్రంలో విస్తరణ అమలుకు నోచుకుంది. ఈ మేరకు సేకరించిన ఆస్తులకు 2015 ఏడాదిలోనే పరిహారాన్ని అందించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌కు చెందిన మూడు ల్యాండ్ పార్శిల్స్‌కు పరిహారం ఇచ్చారు. శ్రీశైలం యాదవ్ పేరిట 201.12 చదరపు గజాలకుగాను రూ.1,83,23,559 కోట్లు ఆయన సతీమణి కస్తూరి పేరిట ఉన్న 201.12 చదరపు గజాలకు రూ.1,83,23,558 కోట్లు, మరో 116.78 చదరపు గజాలకు రూ.58,13,200 లక్షలు ఇలా మొత్తం 519.02 చదరపు గజాలకుగాను రూ.4,24,60,317 కోట్ల పరిహారాన్ని చెక్కుల రూపంలో (20.11.2017)లో తీసుకున్నారు.
ఆస్తులు సేకరించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలకు రాగా.. పరిహారం పొందినందుకుగాను తనే స్థలాన్ని స్వచ్ఛందంగా ఇస్తానని హామీ ఇచ్చిన శ్రీశైలం యాదవ్ తన ఇంటికి ఆనుకుని ఉన్న దుకాణాలు, మెట్లు, బాల్కనీని కూల్చివేసుకున్నారు. కానీ 519.02 చదరపు గజాలను పూర్తిగా అప్పగించలేదు. రహ్మత్‌నగర్, వెంగళ్రావునగర్, బోరబండ డివిజన్లతో పాటు కూకట్పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్, మోతీనగర్, మాదాపూర్ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన రహదారిలోని ప్రమాదకరమైన మలుపులో నిత్యం ఎదురవుతున్న ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రోడ్డు విస్తరణను వేగవంతం చేయాల్సిందే అని కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్‌కుమార్ పటేల్ పట్టుబట్టడంతో పలుమార్లు అధికారులు అక్కడకు వచ్చి పరిశీలించిన న్యాయపరమైన చిక్కులను కల్పిస్తూ అడ్డంకులు సృష్టించారు.
Land Map
ఆ కుటుంబం ఆధీనంలోనే 134 గజాలు..
శ్రీశైలం యాదవ్ తాను పరిహారం పొందిన మేరకు పూర్తి స్థలాన్ని ఇవ్వకుండా 134 చదరపు గజాలను తన ఆధీనంలోనే ఉంచుకొని తిరిగి నిర్మాణాన్ని చేపట్టాడు. జీహెచ్ఎంసీ అధికారులు వచ్చి ఇదేమని ప్రశ్నించిన వినకుండా మొండికేశారు. తన ఎదురుగా ఉన్న వారి నుంచి మిగిలిన స్థలాన్ని తీసుకోవాలని సూచిస్తే.. ఎదురుగా ఉన్న మరో యజమాని ఇదెక్కడి అన్యాయం? నిబంధనల ప్రకారం ఇరువైపులా స్థలాన్ని తీసుకోవాలేగానీ పూర్తిగా తన వైపు నుంచి ఎలా తీసుకుంటారని తాను పరిహారం పొందిన మేరకు స్థలాన్ని అప్పగించి ప్రహరీ నిర్మించుకున్నారు. దీంతో పేరుకు రోడ్డు విస్తరణ జరిగినప్పటికీ ఆ మూల మలుపు మాత్రం పూర్తిస్థాయి విస్తరణకు నోచుకోక ఇప్పటికీ ప్రమాదకరంగానే మిగిలింది. మూడేండ్ల కిందట ఈ మూల మలుపులో ఆర్టీసీ బస్సు కింద పడి ఒక మహిళ కూడా చనిపోయింది. రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది గాయపడ్డారు.
నోటీసులు ఇచ్చినా అదే దౌర్జన్యం..
ఈ మూల మలుపు విస్తరణకు జీహెచ్ఎంసీ అధికారులు శతవిధాలా ప్రయత్నించినా శ్రీశైలం యాదవ్ మాత్రం దౌర్జన్యంగా అధికారులను సైతం భయపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో 5.5.2021 జీహెచ్ఎంసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (భూసేకరణ) శ్రీశైలం యాదవ్‌కు నోటీసు కూడా జారీ చేశారు. తమ యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించారని, అందులో ఇంకా 134 చదరపు గజాలను ఆక్రమించి నిర్మాణాలను చేపట్టినట్లుగా తేలినందున వెంటనే స్థలాన్ని అప్పగించాలని అందులో హెచ్చరించినా వివిధ మార్గాల్లో అధికారులకు మోకాలడ్డుతున్నారు.
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాల్లోనూ వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ కార్పొరేటర్లు దేదీప్యరావు, రాజ్‌కుమార్ పటేల్ ఈ మూల మలుపు ప్రమాదాలపై గళం వినిపించారు. ప్రస్తుతం రహ్మత్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ కాంగ్రెస్‌లో ఉండగా.. గతంలో బీఆర్ఎస్లో ఉన్న సమయంలో ఆ కౌన్సిల్ సమావేశాల్లో శ్రీశైలం యాదవ్ కబ్జాపై ఫిర్యాదులు చేశారు. తాను డబ్బులు తీసుకున్న తర్వాత మొత్తం స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం అప్పగించానంటూ కోర్టులో వాదించి స్టే ఉత్తర్వులు పొందిన శ్రీశైలం యాదవ్ స్థానిక అధికారులను భయబ్రాంతులకు గురిచేస్తూ తన కబ్జాను కొనసాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజలకు సేవచేస్తానంటున్న శ్రీశైలం యాదవ్ కుమారుడైన నవీన్ జూబ్లీహిల్స్ బరిలో దిగుతుండటంతో ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో చూడాలని స్థానికులు వేచి చూస్తున్నారు.
ప్రాణాలు పోతున్నా లెక్కచేయరా..?
యూసుఫ్‌గూడ చెక్‌పోస్ట్ నుం చి వెంగళరావునగర్ డివిజన్ వైపు వెళ్లే రహదారిలో మూలమలుపు వద్ద చిన్న శ్రీశైలంయాదవ్ కుటుం బం రోడ్డు విస్తరణ కోసం స్థలం ఇచ్చేందుకు 2017లోనే నష్టపరిహారం తీసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో స్థలాన్ని అప్పగించలేదు. ఈ విషయమై 2020లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో నాలుగు సార్లు ఈ వ్యవహారాన్ని లేవనెత్తాం. దీనికి స్పందించిన అధికారులు కొంతమేర కూల్చివేసినా వారిపై రకరకాల ఒత్తిడి తెచ్చి అరకొరగా విస్తరణ చేయించారు. అభివృద్ధి చేస్తామంటూ ప్రజలముందుకు వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందు తన ఇంటిముందు రోడ్డు విస్తరణకు సహకరించాలి.
-దేదీప్యరావు, కార్పొరేటర్, వెంగళరావునగర్