బంజారాహిల్స్,అక్టోబర్ 10: తెలంగాణ హక్కుల కోసం నిరంతరం పోరాడడమే కాకుండా హైదరాబాద్ రాజకీయ రంగంలో తనదైన ముద్రను వేసిన మాజీ సీఎల్పీ నేత పీజేఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని నియోజకవర్గాల్లో నవీన్ యాదవ్ వ్యాఖ్యలు ఆయన అభిమానులతోపాటు, సొంతపార్టీ నేతల్లో ఆగ్రహం కలిగించాయి. వివిధ పార్టీల్లోని పీజేఆర్ అభిమానులు నవీన్ యాదవ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఉమ్మడి ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగమైన ఖైరతాబాద్, జూబ్లీహిల్స్,కూకట్పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఉన్న వేలాదిమంది అభిమానులు నవీన్ యాదవ్ వ్యాఖ్యలను ఖండించారు. పీజేఆర్ చొరవతోనే అనేక బస్తీలు ఏర్పాటయ్యాయని, ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అనేక బస్తీలను నిలబెట్టింది పీజేఆర్ అని వారు గుర్తుచేసుకున్నారు.
పీజేఆర్ అనుచరుడిగా పనిచేసిన చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకు నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాగానే పీజేఆర్నే నాన్ లోకల్ అని వ్యాఖ్యానించడం ఆయన అహంకారపూరిత వైఖరికి నిదర్శమని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్‌కు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నిరసనలు తెలిపారు. రహ్మత్‌నగర్ డివిజన్లోని శ్రీరాంనగర్, కార్మికనగర్ ప్రాంతాల్లో పలు పార్టీలకు చెందిన పీజేఆర్ అభిమానులు పీజేఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. నియోజకవర్గంలోని పేదలంతా పీజేఆర్‌ను దేవుడిలా కొలుస్తారని, ఆయన పేరుతో రహ్మత్‌నగర్‌లోని శివమ్మపాపిరెడ్డి హిల్స్‌లో గుడి కట్టారంటే ఆయన స్థానం ఏంటో అర్థం అవుతుందని, అలాంటి నేతను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన నవీన్ యాదవ్ వెంటనే క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పీజేఆర్ అభిమానులు వినోద్ తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన ఉమ్మడి ఖైరతాబాద్‌కు ప్రాతినిధ్యం వహించి తెలంగాణ కోసం సొంతపార్టీ ప్రభుత్వాన్నే ధిక్కరించిన నేత పీజేఆర్‌ను అవమానించేలా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు వెంటనే ఉప సంహరించుని క్షమాపణ చెప్పకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఏ మాత్రం అవగాహన లేని వారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. పార్టీలకు అతీతంగా మేమంతా పీజేఆర్‌ను అభిమానిస్తాం.
-నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ నేత, రహ్మత్‌నగర్