సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల సమయంలో ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామంటూ నమ్మించి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ద్వారా ఖజానా నింపుకొనేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నది. హెచ్ఎండీఏ పరిధిలో 3.60 లక్షల మంది ఓపెన్ ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకోగా, ఇందులో 1.16 లక్షల అర్జీలను పరిశీలించారు. వీటిలో 1.12 లక్షల దరఖాస్తుల్లో ఉన్న లోపాలను వివరిస్తూ అధికారులు షార్ట్ ఫాల్ చేయగా, 653 దరఖాస్తులను తిరస్కరించారు.
అయితే పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వేగంగా పరిష్కారించాలని ప్రభు త్వం యోచిస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం చూపుతున్న చొరవతో సామాన్యుడిపై ఎల్ఆర్ఎస్ భారం పడనున్నదని రియల్ ఎస్టేట్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికల్లో ఓట్ల కోసం ఎల్ఆర్ఎస్ రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, గెలిచిన తర్వాత కేవలం ఖజానా నింపుకొనేందుకే ఎల్ఆర్ఎస్ను తెరమీదకు తీసుకొచ్చిందని తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నారగోని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
కాంగ్రెస్ సర్కారు ఎల్ఆర్ఎస్ను ఆదాయ వనరుగా భావిస్తోందని, మార్కెట్ ధరపై చదరపు గజానికి 14శాతం మేర వసూలు చేయనున్నదని చెప్పారు. ఈ లెక్కన ప్రభుత్వం ఒక్కో దరఖాస్తుదారులపై రూ.2-4లక్షల భారం మోపేందుకు సిద్ధమవుతున్నదన్నారు. కాంగ్రెస్ సర్కారు పునరాలోచన చేయాలని, ఎల్ఆర్ఎస్ను పూర్తిగా రద్దు చేయాలని, లేదంటే కలిసివచ్చే పార్టీలు, ప్రజా సంఘాలతో ఎల్ఆర్ఎస్ వ్యతిరేక ఉద్యమానికి రూపకల్పన చేస్తామని ప్రవీణ్ స్పష్టం చేశారు.