Congress | సిటీబ్యూరో, శేరిలింగంపల్లి, కొండాపూర్ మే 19 : సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్న చందంగా మారింది ప్రజా పాలన ప్రభుత్వ పనితీరు…తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి..కాగితాల్లోనే ప్రాజెక్టుల పేర్లు మార్చారే తప్ప చెక్కు చెదరని నిర్మాణాలపై కేసీఆర్ వేసిన ముద్రను చెరపడం సాధ్యపడడం లేదు..సచివాలయం, అంబేద్కర్ భారీ విగ్రహం ఇలా ఒక్కటేమిటీ తాజాగా ఎస్ఆర్డీపీ ఫలాలను సైతం తమ ఖాతాల్లోకి వేసుకుంటూ వస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.
సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా..
కేసీఆర్ ప్రభుత్వం సిగ్నల్ రహిత ప్రయాణమే లక్ష్యంగా రూ.5112.36 కోట్ల అంచనా వ్యయంతో 47 ప్రాజెక్టులు చేపట్టగా, 36 ప్రాజెక్టులను అనతికాలంలోనే పూర్తి చేసి.. వాటి ఫలాలను నగర పౌరులకు అందజేసింది. 16 నెలల కాంగ్రెస్ పాలనలో పురోగతిలో తుది దశలో ఉన్న ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తెచ్చి..తామే తీసుకువచ్చామని గొప్పలు చెప్పుకుంటూ వస్తున్నది. ఇప్పుడు ఈ గొప్పల జాబితాలో శిల్పా లే అవుట్ ఫేజ్-2ను చేర్చింది.
దాదాపు 70 శాతం బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టును నెలల వ్యవధిలోనే పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును ఏడాదిన్నర సమయం తీసుకుని అటు వాహనదారులను, ఇటు స్థానికులను ముప్ప తిప్పలు పెట్టడమే కాకుండా ప్రాజెక్టు నిర్మాణ మొత్తాన్ని 16 నెలల్లోనే పూర్తి చేశామంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నది. ప్రాజెక్టు మొత్తాన్ని గడిచిన 16 నెలల్లో శిల్పా లే అవుట్ నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తుండడంపై ఐటీ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని కప్పిపుచ్చుతూ మేమే చేశామంటూ ప్రగల్భాలు పలుకుతూ వాస్తవాలు దాచే ప్రయత్నం చేస్తుందని మరికొందరు నెటిజన్లు మండిపడ్డారు. వాస్తవంగా 1.1 కిలోమీటర్ల మేరలో రూ.446.13కోట్ల అంచనాతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు తొలుత 23 మే 2018లోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.330 కోట్ల అంచనాతో పరిపాలన అనుమతులు ఇచ్చి పనులకు శ్రీకారం చుట్టడం గమనార్హం. సవాల్‌గా మారిన భూ సేకరణను సమర్థవంతంగా పూర్తి చేసి పనుల్లో వేగం పెంచింది. ఈ లోగా 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పర్యవేక్షణ లేమి కారణంగా ప్రాజెక్టు నిర్ణీత గడువును వాయిదా వేస్తూ దాదాపుగా మూడు సార్లు లక్ష్యం గడువును పెంచారు.
ట్రాఫిక్ అధికమవ్వడంతో..
బీఆర్ఎస్ హయాంలో అప్పటి పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముందు చూపుతో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్ఆర్డీపీ) కింద గచ్చిబౌలి ప్రాంతంలో నెలకొన్న పలు ఐటీ కారిడార్లను దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ సమస్యను తగ్గించడంతోపాటు భవిష్యత్తు అవసరాలను అనుగుణంగా గచ్చిబౌలి ఔటర్ రింగ్ రోడ్ ప్రధాన కూడలిలో రూ: 466.13 కోట్ల భారీ వ్యయంతో శిల్ప లేఅవుట్ ఫె్లై ఓవర్ నిర్మాణం పనులు రెండు దశల్లో నిర్మాణానికి శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.
కాగా మొదటి దశలో భాగంగా శంషాబాద్ ఓఆర్ఆర్ వైపు నుంచి శిల్పా లేఅవుట్ మైండ్ స్పేస్(మాదాపూర్) వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల మేరకు వై ఆకారంలో శిల్పా లేఅవుట్ మొదటి దశ ఫె్లైఓవర్ నిర్మాణం శరవేగంగా పూర్తి చేసి 25 నవంబర్ 2022 లోనే ప్రారంభించారు. అనంతరం రెండో దశ నిర్మాణ పనులు ఓఆర్ఆర్ నుంచి కొండాపూర్ వైపు గచ్చిబౌలి ప్రధాన కూడలి మీదుగా 1.2 కిలోమీటర్ల మేరకు 26 మీటర్ల వెడల్పు తో 6 లేన్ల విశాలమైన మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్ రూ. 178 కోట్ల వ్యయంతో పనులు చేపట్టారు.
పనులు చురుగ్గా సాగుతున్న వేళ 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులను అశ్రద్ధ చేసి కాలయాపన చేస్తూ వచ్చింది. ఫలితంగా ఆ ప్రాంతంలో ఊహించని విధంగా ట్రాఫిక్ ఇబ్బందులు అధికమవ్వడంతో ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, వివిధ విభాగాల ఒత్తిడి మేరకు శిల్పా లే అవుట్ ఫ్లైఓవర్ రెండో దశ నిర్మాణ పనులపై దృష్టి సారించింది. 2025 జనవరి నాటికి పూర్తి కావాల్సిన పనులు ఆదిశగా జరగలేదు.
తొలుత గతేడాది మార్చి, సెప్టెంబర్, ఆ తర్వాత ఈ ఏడాది ఈ నెల 15వ తేదీ వరకు పూర్తి చేయాలని లక్ష్యాన్ని ఖరారు చేసుకున్నారు. కానీ గచ్చిబౌలి కూడలిలో రహదారికి ఇరువైపులా ఉన్న భవనాల స్థల సేకరణను జాప్యంగా పేరొంటూ పనులను నత్తనడకన సాగించడం గమనార్హం. కాగా, గచ్చిబౌలి జంక్షన్ నుంచి నానక్ రాం గూడ టోల్గేట్ వరకు పెద్ద ఎత్తున వాహనాలు ట్రాఫిక్ జామ్‌లో నిలిచిపోతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్‌లో చికుకొని ఐటీ ఉద్యోగులు నిత్యం అవస్థలు పడుతున్నారు.
తాజా టార్గెట్‌లో పూర్తి చేసేనా?
ఈ నెలాఖరు నాటికల్లా ఈ ప్రాజెక్టును అందుబాటులోకితీసుకురావాలన్న లక్ష్యంతో ఇటీవల కాలంలో కమిషనర్ తరచూ పర్యటనలు చేస్తూ అధికారులను దిశానిర్దేశం చేస్తున్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ ఆర్వీ కర్ణన్ పది రోజుల వ్యవధిలోనే రెండు సార్లు పర్యటించారు. సోమవారం కమిషనర్ పర్యటించి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
వాస్తవంగా తుది దశలో చేపట్టాల్సిన సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ, ఫె్లై ఓవర్‌కి ఇరువైపులా రాంపుల నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాలేదు. కొండాపూర్ వైపు ర్యాంపు నిర్మాణ పనులు కొనసాగుతున్న పెయింటింగ్ పనులు ఫె్లైఓవర్ కింద గ్రీనరీ పనులు ఇంకా చేపట్టాల్సి ఉంది. కాగా అధికార యంత్రాంగం మాత్రం జూన్ మొదటి వారంలో ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు సిద్ధం చేస్తుండడం గమనార్హం.