కవాడిగూడ, జూన్ 18: మణిపూర్‌లో జరుగుతున్న గొడవలపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని మణిపూర్ హైదరాబాద్ సొసైటీ అధ్యక్షుడు దినేష్ సింగ్, సభ్యుడు జెన్వాసన్ అన్నారు. వెంటనే దాడులను ఆపాలని వారు డిమాండ్ చేశారు. మణిపూర్ రాష్ట్రంలో శాంతియుతంగా తమ మైథేయి కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని ర్యాలీ నిర్వహిస్తుండగా కొన్ని దుష్టశక్తులు ర్యాలీలో పాల్గొని కాల్పులు జరపడంతో అనేక మంది అమాయక ప్రజలు ప్రాణాలను కోల్పోయారని, ఈ దాడుల్లో మహిళలు, గర్భిణులు, చిన్నారులు అనేక మంది ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
మణిపూర్‌లో జరుగుతున్న గొడవలను ఆపాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో మణిపూర్ హైదరాబాద్ సొసైటీ సభ్యులు, మణిపూర్ పీస్ కమిటీ ఆధ్వర్యంలో ప్ల కార్డులతో శాంతియుత నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మణిపూర్‌లో జరుగుతున్న గొడవలు మతాలకు సంబంధించినవి కాదని, కేంద్ర ప్రభుత్వం మతకల్లోలంగా గుర్తించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. మణిపూర్‌లో ఎంతో కాలంగా మైథేయి కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసినా, ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. హిల్స్ యాక్ట్ ఆర్టికల్ 371 నాన్ ట్రైబల్స్ మణిపూర్ రాష్ట్రంలో స్థలాలు కొనుగోలు చేయడానికి అర్హులు కారని, భవిష్యత్తు తరాలకు ఇది ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అన్నారు.
అందుకే తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలని వారు డిమాండ్ చేశారన్నారు. దేశంలోని కొన్ని రాష్ర్టాల్లో నాన్ ట్రైబల్స్‌గా గుర్తించినప్పటికినీ మణిపూర్ రాష్ట్రంలో మాత్రం పట్టించుకోకుండా మత ఘర్షణల పేరుతో అల్లర్లు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మణిపూర్‌లో గత రెండు నెలలుగా ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారన్నారు. రాష్ట్రంలో జరిగే గొడవలను వెంటనే ఆపేసి, శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే విధంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమానికి సామాజిక వేత్త చీకోటి ప్రవీణ్ కుమార్‌తోపాటు మణిపూర్ హైదరాబాద్ సొసైటీ సభ్యులు కప్పర్ సింగ్, కొంసం ప్రకాశ్, మంజాయ్ సింగ్, లెనిన్, వీహెచ్‌పీ ప్రతినిధి అజయ్ రాజ్, మణిపూర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.