HMDA | సిటీబ్యూరో : హెచ్ఎండీఏలో శాశ్వత, డిప్యూటేషన్ అధికారుల మధ్య ఉన్న లుకలుకలు బయటపడుతున్నాయి. ఇప్పటికే డిప్యూటేషన్ అధికారులతో హెచ్ఎండీఏను నింపేస్తున్నారని శాశ్వత సిబ్బంది అసహనంతో ఉండగా, తాజాగా జరుగుతున్న కొన్ని సంఘటనలతో ఇరు ఉద్యోగుల మధ్య ఉన్న వైరుధ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో కొందరు డిప్యూటేషన్ ఉన్నతాధికారులు సిబ్బందిని నియంత్రించే ధోరణితో వ్యవహరిస్తున్నారని సమాచారం. కొన్ని వివాదాస్పదమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయనే అనుమానంతో కీలక బాధ్యతలకు దూరంగా ఉంచుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తీసుకువచ్చే విభాగాల్లో అత్యంత కీలకమైనది హెచ్ఎండీఏలోని ప్లానింగ్ శాఖ. హెచ్ఎండీఏ ప్లానింగ్ అనుమతిస్తేనే అల్ట్రా మోడ్రన్ విల్లా నుంచి హైరైజ్ ప్రాజెక్టు వరకు నిర్మాణం సాధ్యం అవుతుంది. అందుకే ఈ విభాగంలో పనిచేసేందుకు ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యూటేషన్‌పై వస్తుంటారు. ఈ క్రమంలోనే శాశ్వత ఉద్యోగులతో నిండుగా ఉండాల్సిన ఈ విభాగం గడిచిన కొంతకాలంగా డిప్యూటేషన్ అధికారులతో నిండిపోయింది. ఇదే హెచ్ఎండీఏ మాతృక కలిగిన ఉద్యోగుల అవకాశాలు, ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని వాపోతున్నారు. దీంతో డిప్యూటేషన్ వర్సెస్ శాశ్వత అధికారుల అన్నట్లు వ్యవహారాలు సాగుతున్నాయి.
డిప్యూటేషన్ వర్సెస్ శాశ్వత ఉద్యోగుల మధ్య పెరుగుతున్న వివాదాలతో కొందరు అధికారులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. విధుల కేటాయింపుల్లో ప్రాధాన్యతనివ్వకుండా… అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని చేతుల్లో పెట్టుకొని శాశ్వత సిబ్బందికి దూరంగా ఉంచుతున్నట్లు తెలిసింది. కనీసం పై అధికారి అనే భక్తి కూడా ఉండాల్సిన అవసరమే లేదన్నట్లుగా డిప్యూటేషన్ అధికారులు సిబ్బందిని ఊసిగొల్పుతున్నట్లుగా తెలిసింది. దీంతో కొందరు ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారు. డిపార్టుమెంట్లో జరుగుతున్న ఈ వ్యవహారం తమకు వేధింపుల కంటే దారుణంగా ఉన్నదని కొందరు ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.