ఎర్రగడ్డ, జనవరి 20: వివిధ వృత్తులు, ఒత్తిడుల కారణంగా ఎంతో మంది మానసిక రుగ్మతలకు గురవుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ సి.పార్థసారథి అన్నారు. ఐఎంహెచ్ హైదరాబాద్ అలుమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ‘మానసిక ఆరోగ్యం గురించి ప్రజలను చైతన్యవంతం చేయటంలో మీడియా పాత్ర’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పార్థసారథి మాట్లాడుతూ మానసిక వైద్య నిపుణుల సేవలు నగరంతో పాటు జిల్లాల్లో కూడా అందించాలని కోరారు.
మానసిక సమస్యలున్న వారిలో 25 శాతం మంది తమ సమస్యలను ఇతరులతో పంచుకుంటున్నారని మిగితా వాళ్లు ఆ బాధలను దిగమింగుతున్నారని అన్నారు. విశిష్ట అతిథులుగా విచ్చేసిన తెలంగాణ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, మీడియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఇండియా మేనేజింగ్ ట్రస్టీ దేవులపల్లి అమర్‌లు మాట్లాడుతూ మానసిక సమస్యలతో బాధ పడుతున్నవాళ్లను రోగులుగా చూడకుండా సరైన సలహాలు ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, ఇతర డిజిటల్ మీడియాలు సమాజంలో మానసిక సమస్యలతో బాధ పడుతున్నవారికి చక్కని సలహాలు, సూచనలివ్వటానికి సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.
అనంతరం డాక్టర్ పి.రఘురామిరెడ్డి ఎండోమెంట్ ఆ రేషన్ అవార్డును దేవులపల్లి అమర్‌కు అందజేసి దేవులపల్లితో పాటు అల్లం నారాయణను శాలువాలతో సన్మానించారు. సెమినార్లో ఐఎంహెచ్ హైదరాబాద్ అలుమ్ని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ పి.కిషన్, కార్యదర్శి రిషికేష్గిరిప్రసాద్, శివ అనూప్, సుధీర్‌రావు, మానసిక వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ అనిత, మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ ఉమాశంకర్, మానసిక వైద్య నిపుణులు వి.జార్జిరెడ్డి, విశ్వాసన్, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.
హెచ్ఐసీసీలో నాలుగు రోజుల పాటు సదస్సు..
సైక్రియాట్రిక్ సొసైటీ 76వ వార్షిక జాతీయ సదస్సును ఈ నెల 22 నుంచి 25 వరకు హెచ్ఐసీసీలో నిర్వహించనున్నట్లు ఈ సదస్సుకు ఆర్గనైజింగ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ పి.కిషన్ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ విదేశాల నుంచి వందలాది మంది మానసిక నిపుణులు ఈ సదస్సుకు హాజరౌతారని వెల్లడించారు. సమాజంలో మానసిక రుగ్మతలను తగ్గించటం ధ్యేయంగా అనుసరించాల్సిన విధానాలు, హాజరైన ప్రతినిధుల సూచనలను పొందుపర్చటమే కాకుండా నిపుణుల విలువైన అభిప్రాయాలను సేకరించటం జరుగుతుందని ఆయన అన్నారు.