Samagra Kutumba Survey | సిటీబ్యూరో/బంజారాహిల్స్/ముషీరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : సమగ్ర కుటుంబ సర్వే సమరాన్ని తలపిస్తున్నది. వివరాలు ఇవ్వండి అంటూ వెళ్లిన అధికారులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. సర్వే క్చశ్చనెయిర్ చదువుతుంటేనే జనం చికాకు పడుతున్నారు. ‘ఏందీ దౌర్భాగ్యం మాకు. వేరే పనేలేనట్టు. వివరాలు ఎందుకివ్వాలి. ఇంతకు ముందు మాకేం కావాలో ప్రజా పాలన దరఖాస్తులు అందించాం కదా. అవన్నీ వట్టివేనా? మళ్లీ గిప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అంటూ వచ్చారు. మేం వివరాలు ఇవ్వం. మీరేం చేసుకుంటారో చేసుకోండి.
స్టిక్కర్లు కూడా మా ఇంటికి అతికించొద్దు..’ అంటూ అధికారులపై జనం మండిపడుతున్నారు. దీంతో సర్వేకు వెళ్తున్న అధికారులు భయభ్రాంతులకు గురవుతున్నారు. జనం అంతా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారని.. వివరాలు అడిగితే సహకరించడం లేదని ఓ సర్వే బృందం పేర్కొంది. నగరంలో ఎన్యుమరేటర్లకు ఎదురవుతున్న చేదు అనుభవాలతో సమగ్ర కుటుంబ సర్వే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌పై జనంలో వ్యతిరేకత వెల్లువెత్తుతుండటానికి ఈ సమగ్ర సర్వేనే ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు. మొన్నటి వరకు హైడ్రాతో పేదోళ్ల ఇండ్లు కూల్చి.. నిన్న మూసీ నిరుపేదల ఇండ్లను నేలమట్టం చేసిన సంఘటనలతో జనం ఆగ్రహంతో ఉన్న సమయంలో ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే పేరుతో వివరాలు ఇవ్వాలంటూ వస్తున్న అధికారులపై నగరవాసులు మండిపడుతున్నారు.
సమగ్ర కుటుంబ సర్వేకు సంబంధించిన స్టిక్కర్లను అంటించేందుకు బస్తీలకు వెళ్తున్న సర్వే సిబ్బందికి స్థానికులు చుక్కలు చూపిస్తున్నారు. ‘ప్రజాపాలన అంటూ ఆరునెలల కిందట దరఖాస్తులు తీసుకున్నారు.. వాటిని ఏం చేశారం’టూ కొంతమంది ప్రశ్నిస్తుండగా, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేస్తే ఇప్పటిదాకా గతి లేదు కానీ మళ్లీ సర్వే అని ఎందుకు వచ్చారంటూ విసుగును ప్రదర్శిస్తున్నారు.
వృద్ధులు, దివ్యాంగుల పింఛన్ల గురించి నిలదీయడంతో పాటు బూతులు తిడుతున్నారని, మహిళలు రూ.2500 ఎందుకు ఇవ్వడం లేదని కోపంతో చూస్తున్నారని స్టిక్కర్లు వేసేందుకు వెళ్లిన సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వే చేస్తున్న వారిలో అంగన్వాడీ వర్కర్లు, ఆశా వర్కర్లు, టీచర్లు, యూసీడీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్స్, మహిళా పొదుపు సంఘాల సభ్యులు పాల్గొంటున్నారు. తమను స్థానికంగా అందరూ గుర్తుపడతారని, గతంలో ఇచ్చిన దరఖాస్తుల గురించి నిలదీస్తుంటే ఇబ్బందికరంగా ఉందని సర్వే సభ్యులు పేర్కొన్నారు. కేవలం స్టిక్కర్లు వేసేందుకు వెళ్తేనే ప్రజలు ఈ స్థాయిలో నిలదీస్తుంటే, క్షేత్రస్థాయిలో 75 ప్రశ్నలు వేసేందుకు వెళ్లినప్పుడు ఏ విధంగా స్పందిస్తారో అనేది తలచుకుంటేనే భయంగా ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.
ముషీరాబాద్ నియోజవర్గం గాంధీనగర్ డివిజన్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను స్థానికులు అడ్డుకున్నారు. గాంధీనగర్‌లో సర్వే చేయడానికి వచ్చి ఎన్యుమరేటర్లతో వాగ్వాదానికి దిగారు. ఎన్యుమరేటర్లు ప్రశ్నావళిని అడుగుతుండగా, ఎందు కు సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించా రు. ఏంపథకాలు ఇచ్చారని సర్వే చేస్తుం డ్రు, ఇచ్చిన హామీ ఏమయ్యాయంటూ నిలదీశారు. అధికారులు సర్దిచెప్పే ప్రయ త్నం చేయగా వారు ససేమిరా అన్నారు.
దీంతో చేసేది లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాంనగర్‌లోనూ కాలనీ వాసులందరూ సర్వేకు సహకరించలేదు. అధికారులు వెనక్కి వెళ్లిపోయారు. ఇలా నగరంలో ఎన్యుమరేటర్లకు ఇలాంటి అనుభవాలే ఎదురవుతుండటంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు కూడా చేసేదేమీ లేకపోవడంతో ఎలాగోలా మీరే సర్వే ముగించాలంటూ ఎన్యుమరేటర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. మొత్తంగా సమగ్ర కుటుంబ సర్వే ఆదిలోనే జనం ఆగ్రహం చవి చూస్తుండటంతో ఏం చేయాలో తెలియక అధికారులు అయోమయం చెందుతున్నారు.
గ్రేటర్ పరిధిలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను షెడ్యూలు ప్రకారం కచ్చితత్వంతో చేపట్టేందుకు సమన్వయ, పర్యవేక్షణ అధికారులను రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం. దానకిశోర్ నియమించారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రత్యేకంగా మెమో జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో నిర్వహించే సామాజిక,ఆర్థిక,విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే సమన్వయ అధికారిగా హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు. అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధిలోని సికింద్రాబాద్, చార్మినార్ జోన్లకు హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ శ్రీవత్స కోట, ఎల్బీనగర్, ఖైరతాబాద్ జోన్లకు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉప కార్యదర్శి ప్రియాంక, శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లకు జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మయాంక్ మిట్టల్‌లను పర్యవేక్షణ అధికారులుగా నియమించారు.
ఖైరతాబాద్ నియోజకవర్గంలోని బంజారాహిల్స్, వెంకటేశ్వరకాలనీ, జూబ్లీహిల్స్ డివిజన్లలో మూడురోజుల కిందట ప్రారంభమైన సర్వే కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ స్టిక్కర్లు అంటించే కార్యక్రమం కొనసాగుతున్నది. అయితే సర్వేలో పాల్గొంటున్న ఎన్యుమరేటర్లకు ఆయా ఇండ్ల యజమానులు సహకరించకపోవడంతో పాటు కిరాయికి ఉన్నవారి ఇండ్లకు స్టిక్కర్లు ఎలా అంటిస్తారంటూ గొడవలకు దిగుతున్నారు. కుల గణన సర్వే అంటూ ఆదాయ వివరాలు, ఆస్తుల వివరాలు, ఆధార్ కార్డుల వివరాలను ఎలా సేకరిస్తారని కొంతమంది తీవ్రస్థాయిలో నిలదీస్తున్నారు.
కాగా, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలకు చెందిన నివాసితులు మరింత తీవ్రంగా ప్రతి స్పందిస్తున్నారు. సర్వే సిబ్బందిని దూషించడంతో పాటు తమ ఇంటిముందు నుంచి వెళ్లకపోతే కుక్కలను వదులుతామని బెదిరిస్తుండడంతో వారంతా తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బంజారాహిల్స్ రోడ్ నం. 3లోని అరోరా కాలనీలో సర్వే కోసం వెళ్లిన టీచర్లపై ఇంటి యజమానులు కుక్కలు ఉసిగొల్పుతామంటూ బెదిరించడం తీవ్ర కలకలం రేపింది. ప్రజల్లో సరైన అవగాహన కల్పించకపోవడంతో ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నదని సర్వే సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.