సిటీబ్యూరో, మే20,(నమస్తే తెలంగాణ): కోర్ సిటీలో మురుగునీటి వ్యవస్థ ఆధునీకరణ కోసం చేపట్టిన జోన్-3 సీవర్ నెట్ వర్క్ ప్రాజెక్టు పనులను మంగళ వారం జలమండలి ఎండీ అశోక్ రెడ్డి.. కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహీయుద్దీన్తో కలిసి పరిశీలించారు. టోలీచౌకి ఫ్లై ఓవర్ ప్రధాన రహదారిలో చేపట్టే టన్నెలింగ్ పనులకు ఆటంకాలు లేకుండా చేపట్టాలని సూచించారు. దాదాపు 8 నుంచి 11 మీటర్ల లోతులో జరిగే టన్నెలింగ్ పనులవల్ల ట్రాఫిక్, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వర్షాకాలంలోపే పనులు పూర్తి చేయలన్నారు.
అనంత రం 7 టూంబ్స్ వెళ్లే రహదారిలో చేపట్టే అండర్ గ్రౌండ్ టన్నెలింగ్ పనులను నివాస గృహాల పటిష్టకు ఎలాంటి నష్టం కలగకుండా ఎలా చేయాలో ప్రతిపాదనలు సమర్పించాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే.. వర్షాకాలం సమీపించిన తరుణంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టి వేగంగా పూర్తి చేయాలని ఎండీకి విజ్ఞప్తి చేశారు.
అనంతరం షేక్పేట్ జలమండలి కార్యాలయాన్ని సందర్శించి, పది సంవత్సరాలక్రితం నిర్మించిన 10 మి.లీ సాహర్థ్యం కలిగిన రిజర్వాయర్లను ఇప్పటికి వినియోగంలోకి తీసుకురాకపోవడంపై ఎండీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెంటనే రిజర్వాయర్లను వినియోగం లోకి తీసుకుని, ఏయే ప్రాంతాల్లో నీటి సరఫరా చేయవచ్చో సర్వేచేసి వివరాలను సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్, ఆపరేషన్ డైరెక్టర్ అమరేంద్రరెడ్డి, సీజీఎంలు వినోద్ భార్గవ, రాజేందర్, జీఎంలు శ్రీను నాయక్, కుమార్, ప్రాజెక్టు, ఓఅండ్ఎం అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.