సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ): శాంతి భద్రతల పరిరక్షణతో పాటు పెండింగ్ కేసుల దర్యాప్తును వేగంగా పూర్తి చేయాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు సిబ్బందికి సూచనలు చేశారు. రాబోయే బక్రీద్ పండుగ బందోబస్తు, యూఐ(అండర్ ఇన్వెస్టిగేషన్) కేసుల పురోగతి, పోలీస్ స్టేషన్లలో వర్టికల్స్ పనితీరు తదితర అంశాలపై బుధవారం ఆయన నేరెడ్‌మెట్‌లోని కమిషనరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలను కాపాడే విషయంలో ప్రతి ఒక్కరు కఠినంగా ఉండాలని, ఏ చిన్న విషయాన్ని కూడా తేలికగా తీసుకోవద్దని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తు త్వరితగతిన పూర్తి చేస్తూ , కోర్టుల ద్వరా ఆయా కేసులలోని నేరస్తులకు శిక్షలు త్వరగా పడే విధంగా చేయాలన్నారు. నేరాల నివారణపై ఆయా జోన్, డివిజన్, స్టేషన్, సెక్టార్ల వారిగా సమగ్ర వ్యూహాలు ఉండాలన్నారు.
కేసులు, కౌంటర్ కేసులలో అసలు నిందితులను ఎలా గుర్తించాలి? అట్టి కేసుల విచారణను ఎలా చేపట్టాలి బాధితులకు న్యాయం చేయాలని అనే విషయాలను సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో ఉండే సిబ్బందికి కేటాయించిన ఆయా వర్టికల్స్ పనితీరు సరిగ్గా ఉండాలని, బ్లుకోల్ట్స్, డయల్ 100పై ప్రతి రోజు సమీక్షలు, పర్యవేక్షణలుండాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకొని పెట్రోలింగ్, చెక్ పోస్టుల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు పీవీ పద్మజ, ప్రవీణ్ కుమార్, యాదవ్, సునీతా రెడ్డి, జి నర్సింహారెడ్డి, అరవింద్ బాబు, నాగలక్ష్మి, ఇందిరా, అడిషనల్ డీసీపీ లు, ఏసీపీలు పాల్గొన్నారు.