సిటీబ్యూరో, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): జీహెచ్ఎంసీలో బదిలీల సీజన్ నడుస్తున్నది. శివారు 27 పురపాలికల విలీనం, 12 జోన్లు, 60 సర్కిళ్లు, 300 వార్డులుగా అవతరించిన బల్ధియాలో జోనల్ కమిషనర్ల నియామయం నుంచి అన్ని విభాగాల్లో బదిలీల జాతరకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ఆయా సర్కిళ్లకు డిప్యూటీ కమిషనర్లను నియమించారు. తాజాగా శానిటేషన్ విభాగంలో 60 మంది డీఈఈలను బదిలీ చేస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ఈ 60 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లను బదిలీ చేశారు. విస్తరించిన గ్రేటర్ పరిధిలో చెత్త సేకరణ, నిర్వహణ సమర్థవంతంగా సాగేందుకు ఈ బదిలీలు చేపట్టినట్లు కమిషనర్ పేర్కొన్నారు. దీంతో పాటు మెయింటనెన్స్ విభాగంలో 60 మంది డీఈఈలను బదిలీ చేస్తూ మరో ఉత్తర్వులు కమిషనర్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే నేడు టౌన్‌ప్లానింగ్ విభాగంలో సీపీలు, ఏసీపీల బదిలీలు ఉండే అవకాశం ఉంది.
పాలనా సౌలభ్యం కోసం జరుగుతున్న ప్రక్రియలా కాకుండా బదిలీలో ‘వసూళ్ల జాతర’ను తలపిస్తోందన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఏయే సర్కిల్లో ఎంత ‘గిట్టుబాటు’ అవుతుందో లెక్కలు వేసుకుని మరీ అధికారులు పైరవీలకు పదును పెట్టినట్లు చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే పాత జీహెచ్ఎంసీ పరిధిలోని రెండు సర్కిళ్లకు డీసీలుగా ఉన్న ఇద్దరిని పారిశుద్ధ్య విభాగంలో జాయింట్ కమిషనర్లుగా నియమిస్తే ఇంత వరకు వారు ఆ విధులు నిర్వహించలేదు.
ఐతే రెండు రోజుల క్రితం జరిపిన కొత్త జాబితాలో తిరిగి వారు సర్కిళ్ల డీసీలుగా నియమితులు కావడం విశేషం..ఆది సైతం వారు కోరుకున్న స్థానాల్లోనే నియామకాలు జరగడం పరిస్థితికి అద్దం పడుతున్నది. టౌన్ప్లానింగ్లోనూ ఇదే తరహాలో కోరుకున్న సర్కిళ్లను దక్కించుకునేందుకు అడ్డదారిలో వెళ్తున్నట్లు ప్రచారం సాగుతున్నది. మొత్తంగా ఒకవైపు ఆర్థిక భారం, మరోవైపు కొత్త జోన్లు, సర్కిళ్ల పాలనలో ఎదురయ్యే తలనొప్పులతో సతమతమవుతున్నది. ఇలాంటి తరుణంలో బదిలీల్లో పారదర్శకత లేకపోతే శాఖలన్నీ అవినీతి కూపాలుగా మారే ప్రమాదం ఉంది.
60 సర్కిళ్లకు గానూ 60 మంది డిప్యూటీ కమిషనర్లను నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన కమిషనర్ తక్షణమే ఆయా సర్కిళ్ల బాధ్యతలు తీసుకోవాలనిఆదేశాలు జారీ చేశారు. అయితే కవాడిగూడ సర్కిల్ 40కి శ్రీనివాసరెడ్డిని నియమించారు. అయితే ఆయన బాధ్యతలు తీసుకోలేదు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదివారం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.