మల్కాజిగిరి, ఆగస్టు 22 : అవరోధాలులేని, సురక్షితమైన నిమజ్జానికి సమన్వయంతో శాఖలు పనిచేయాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి సూచించారు. వినాయకచవితి, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లపై శనివారం ఎంఎంసీ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నిమజ్జన కేంద్రాలు, ఊరేగింపు, మార్గాలు, చెరువులు, సరస్సులు, బేబీపాండ్లు, తదితర ప్రాంతాల వద్ద చేపట్టాల్సిన మౌలిక సౌకర్యాలు సకాలంలో పూర్తి చేయాలన్నారు.
అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి, ప్రశాంతంగా ఉత్సవాలు జరిగేలా చూడాలన్నారు. భద్రత, పారిశుధ్యం, మరమ్మతులు, విద్యుత్, పచ్చదనం, తదితర అంశాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు రాధికాగుప్తా, సంచిత్ గంగ్వార్, వికాస్‌మహతో, అదనపు కమిషనర్ రఘుప్రసాద్, చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్‌రావు, వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, సునంద, మాధవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.