సిటీబ్యూరో, జనవరి 3 (నమస్తే తెలంగాణ): మూసీ నదిపై రూ.52 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ముసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను బుధవారం కమిషనర్ క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించారు. ముందుగా చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఎఫ్సీఐ గోడౌన్ వరకు చేపట్టనున్న రోడ్డు నిర్మాణం కోసం రైల్వే, ఫారెస్ట్, ఎస్ఆర్డీపీ ఉన్నతాధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. అనంతరం ముసారాంబాగ్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. త్వరగా అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ఈఎన్సీ జియావుద్దీన్, ఎస్ఆర్డీపీ సీఈ దేవానంద్ , ఎస్ఈ రవీందర్ రాజు తదితరులు పాల్గొన్నారు.