మన్సూరాబాద్, జూలై 19: చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని.. ఎవరైనా చెరువులను ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు పెడతామని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. నాగోల్ డివిజన్ బండ్లగూడ పరిధిలోని ఫతుల్లాగూడ చెరువు ఆక్రమణకు గురైందని స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు శుక్రవారం సదరు ప్రాంతానికి ఈవీడీఎం కమిషనర్ ఏవీ రంగానాథ్ వెళ్లి పరిశీలించారు. ఫతుల్లాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కొంతమంది అక్రమ లే అవుట్ చేసి ఇండ్లు కట్టి ప్రజలకు విక్రయిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేయడంతో సదరు ప్రాంతానికి విచ్చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి వద్ద ఉన్న డాక్యుమెంట్లను పరిశీలించారు. చెరువు కబ్జా విషయంపై మేడ్చల్, రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. గతంలో చెరువు పరిరక్షణ కోసం చుట్టూ వేసిన ఫెన్సింగ్‌ను తొలగించి తప్పుడు సర్వే నంబర్లతో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారని స్థానికులు తెలిపారు.
ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతుంటే మీరు ఏం చేస్తున్నారని అబ్దుల్లాపూర్‌మెట్ రెవెన్యూ అధికారులను, ఇరిగేషన్ అధికారులను ఆయన ప్రశ్నించారు. అనంతరం ఫతుల్లాగూడ చెరువును డ్రోన్ల ద్వారా సర్వేను ప్రారంభించారు. సర్వే అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని ఏవీ రంగనాథ్ తెలిపారు. అనంతరం ఫతుల్లాగూడలోని డీఆర్ఎఫ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ప్లానర్ కె.శ్రీనివాస్, రీజినల్ ఫైర్ ఆఫీసర్ పాపయ్య తదితరులు పాల్గొన్నారు.