
ప్రపంచంలో ఏ వృత్తికి అత్యధిక వేతనం ఇవ్వాలని మీరు భావిస్తున్నారు? ఎందుకు? అని న్యాయ నిర్ణేతలు అడిగిన ఓ ప్రశ్నకు.. అమ్మే నాకు స్ఫూర్తి. అందుకే నా దృష్టిలో తల్లి కావడమే అత్యంత గొప్ప విషయం. అసలు విషయం డబ్బు కాదు. ఒక తల్లికి ప్రేమ, గౌరవం కన్నా గొప్ప వేతనమేముంటుంది. అంటూ మిస్ వరల్డ్ పోటీలో మానుషి చిల్లర్ ఇచ్చిన సమాధానం ఇది. అందాల పోటీలు ఎంత సీరియస్‌గా జరుగుతాయో చెప్పడానికి ఇదో ఉదాహరణ.
సిటీబ్యూరో, జనవరి 7 (నమస్తే తెలంగాణ): అందాల పోటీలు ఎక్కడ జరిగినా తెలుగు అమ్మాయిలదే హవా. మిస్, మిసెస్ పోటీల్లో గెలుపు హైదరాబాద్‌దే. బ్యూటీ పోటీల్లో ప్రతిష్టాత్మక టైటిళ్లు గెలుస్తూ ప్రపంచ దిగ్గజ వేదికలపై హైదరాబాద్ పేరు మార్మోగిస్తున్నారు. వీరిని అనుసరిస్తూ అనేక మంది యువతులు తమ సౌందర్యాన్ని పరీక్షించుకునేందుకు ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్నారు. అందంతో పాటు విజ్ఞానం మేళవించి అత్యంత కీలకంగా పోటీలు జరుగుతుండటంతో ఆ మేరకు శిక్షణ ఇచ్చే సంస్థలకు నగరంలో కొదువలేదు. మొత్తంగా సౌందర్య రాశులకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ నిలుస్తున్నది. బ్యూటీ పోటీలకు నగర అమ్మాయిల నుంచి విశేష స్పందన వస్తుండటం విశేషం.
అందాల భామలు వీళ్లే..
ఇటీవల గుజరాత్లో జరిగిన మిసెస్ ఇండియా-2021 పోటీల్లో అందాల బామ మహ్మద్ ఫర్హా విజేతగా నిలిచి టైటిల్ గెలుచుకోవడంతో పాటు మిసెస్ ఇండియా ఫొటోజెనిక్ ఫేస్‌గా అవార్డు సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్సీ కవితతో ప్రత్యేక అభినందనలు పొందారు. ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో నగరానికి చెందిన వారణాసి మానస విజేతగా నిలిచి హైదరాబాద్ ఖ్యాతిని దేశవ్యాప్తం చేసింది. ప్రస్తుతం ప్రపంచ వేదికపై సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది. మిసెస్ ఇండియా తెలంగాణ-2019 విజేతగా రాధిక అగర్వాల్ నిలిచింది. మిసెస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న సుధాజైన్ నగరంలో చాలా మంది మోడల్స్‌కు శిక్షణ ఇస్తున్నారు. మరో అందాల భామ మిసెస్ ఇండియా టైటిల్ గెలుచుకున్న లక్ష్మి కూడా ఆవాజ్ ట్రస్ట్ స్థాపించి సేవా కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా మోడళ్లకు సూచనలతో పాటు శిక్షణ ఇస్తున్నారు. మిసెస్ ఇండియా 2021 పోటీల్లో ఐటీ ఉద్యోగి వాసవి దత్ మిసెస్ ఇండియా వన్ ఇన్ ఏ మిలియన్ టాలెంటెడ్ అవార్డును కైవసం చేసుకున్నారు. 13 ఏండ్ల చిన్నారి మిస్ ఇండియా యూనివర్స్ ప్రీ టీన్ కిరీటాన్ని సాధించింది. ఇలా ఎందరో సౌందర్యరాశులు హైదరాబాద్ పేరును బ్యూటీ రికార్డులో నిలపారు.
అందం.. విజ్ఞానం..!!
సాధారణంగా అందాల పోటీలు అనగానే వయ్యారి నడకలు.. స్లిమ్ పర్సనాలిటీ.. ఆకట్టుకునే కండ్లు.. అందమైన చిరునవ్వు ఉంటే సరిపోతుందని అందరూ భావిస్తారు. కానీ ఒక్కో అందాల పోటీలో అనేక రకాల టాస్క్‌లు ఉంటాయి. అందం, అభినయంతో పాటు సామాజిక పరిస్థితులపై అవగాహన ఉండాలి. పరిచయం, ర్యాంప్ వాక్, ప్రతిభ, విజ్ఞానం, వాక్చాతుర్యం తదితర అంశాలపై వివిధ దశల్లో వడపోత ఉంటుంది. అంతేకాదు స్టేజీ మీద అప్పటికప్పుడు న్యాయనిర్ణేతలు ఇచ్చే టాస్క్‌లకు సరైన సమాధానం.. వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సమయస్ఫూర్తిగా వ్యవహరించి న్యాయ నిర్ణేతలను ఆకట్టుకోవాల్సి ఉంటుంది.
లక్ష్యం నుంచి వెనకడుగు వేయొద్దు
మన హైదరాబాద్ అనేక సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు. ఇక్కడ చాలా మంది తమ ప్రతిభను స్వేచ్ఛగా ప్రదర్శించుకోవచ్చు. మన హైదరాబాద్ పేరును ప్రపంచానికి బ్యూటీ పోటీల్లో చాలా మంది పరిచయం చేశారు. నేను మిస్ వరల్డ్-2021 పోటీల్లో పాల్గొన్నాను. ఈ పోటీలు కరోనాతో నిలిచిపోయాయి. మరో మూడు నెలల్లో తిరిగి జరగనున్నాయి. కష్టపడితే విజయం తథ్యం.
అందాల పోటీలకు అడుగులు..!!
మిస్ ఇండియా.. మిస్ వరల్డ్.. మిసెస్ ఏషియా.. మిసెస్ ఇండియా.. మిస్ టీన్ యూనివర్స్.. ఇలా ఎన్నో టైటిళ్లు ఫ్యాషన్ ప్రపంచంలో ఉన్నాయి. ఈ కిరీటాలను గెలుచుకోవడానికి లక్షలాది మంది యువతులు తహతహలాడుతున్నారు. కాలేజీ నుంచే ఫ్యాషన్ పోటీల్లో పాల్గొని తమ లక్ష్యానికి బాటలు వేసుకుంటున్నారు. ప్రతి నలుగురిలో ఇద్దరు అమ్మాయిలు ఫ్యాషన్ ప్రపంచంలో తమ సత్తా నిరూపించుకోవాలని భావిస్తున్నారు. కఠోర శ్రమ చేస్తూ తమ దేహా దారుఢ్యాన్ని అందంగా మలుచుకుంటున్నారు. మరికొంతమంది చిన్నతనం నుంచే క్యాట్‌వాక్‌లు అలవాటు చేసుకుంటూ టైటిల్ పోటీల్లో పాల్గొంటున్నారు.
క్రమశిక్షణ కీలకం
పోటీ ఏదైనా క్రమశిక్షణ చాలా కీలకం. హైదరాబాద్ నుంచి చాలా మంది అనేక టైటిళ్లు గెలుచుకున్నారు. వాళ్లందరూ ఒక్కటి రెండు రోజుల్లోనే ప్రపంచ సుందరి అయిపోలేదు. దాని వెనుక ఎన్నో ఏండ్ల కృషి ఉంది. లక్ష్యం ఏర్పరుచుకుంటే సాధించే వరకు వెనకడుగు వేయని మనస్తత్వం ఉండాలి. అప్పుడే అనుకున్న టైటిల్ గెలుచుకోగలుగుతాం. కరోనా సమయంలో కూడా వర్చువల్‌గా పాల్గొని నగరం నుంచి చాలా మంది మిస్, మిసెస్ ఇండియా టైటిళ్లు గెలుచుకున్నారు.