ఖైరతాబాద్, అక్టోబర్ 21: ‘మా కాలేజీలో చేరండి.. మంచి భవిష్యత్తు ఉంటుం ది’ అంటూ పలువురు విద్యార్థుల వద్ద లక్షలాది రూపాయల ఫీజులు వసూలు చేశా రు. కోర్సు పూర్తయిన విద్యార్థులకు సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. తీరా ఉద్యోగాల కో సం ఆ సర్టిఫికెట్లతో ఆస్పత్రులకు వెళ్లిన విద్యార్థులకు యాజమాన్యం చెప్పిన మాటలతో పిడుగు పడినట్లయ్యింది. ఆ సర్టిఫికెట్లు ఇక్కడ చెల్లవని సెలవివ్వడంతో లబోదిబో అంటూ బాధితులు ఆ ఇనిస్టిట్యూట్ వద్దకు పరుగులు తీశారు.
బాధితులకు న్యాయం చేయాల్సిందిపోయి.. యాజమాన్యం బెదిరింపులకు దిగడంతో బాధితులు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై శివశంకర్ కేసు నమోదు చేశారు. కాగా, ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అమీర్‌పేట్‌లోని ఇమేజ్ హాస్పిటల్ లేన్‌లో అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ సైన్సెస్ పేరుతో ఓ పారామెడికల్ ఇనిస్టిట్యూట్‌ను నెలకొల్పారు. ఈ సంస్థకు ఆకాశ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ప్రసాద్ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు.
ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులను టార్గెట్ చేసి వారిని సంప్రదించి తమ విద్యా సంస్థలో చేరితే ఉన్నత ఉద్యోగాలు, అవకాశాలోస్తాయని నమ్మించారు. వారి మాటలను నమ్మిన సుమారు 500 మంది నగరంతో పాటు పలు జిల్లాలకు చెందిన విద్యార్థులు వివిధ బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ కోర్సులో చేరారు. థియరీ, ప్రాక్టికల్స్‌తో మూడేండ్ల వ్యవధి గల ఈ కోర్సులను విజయవంతంగా పూర్తి చేశారు.
ఒక్కొక్కరి వద్ద రూ.55 వేల నుం చి ఆపై లక్షలాదిగా ఫీజులను గుంజారు. కోర్సు పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు సైతం ఇచ్చారు. ఎంతో ఉత్సాహంగా ఆ సర్టిఫికెట్లు అందుకున్న విద్యార్థులు ఉద్యోగాలకు వెళితే ఇంటర్వ్యూలు చేసే యాజమాన్యం విద్యార్థుల వద్దనున్న సర్టిఫికెట్లు యూపీకి చెందిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి చెందినవని, ఇక్కడ చెల్లవని చెప్పడంతో ఖంగుతిని సోమవారం సాయం త్రం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎండీ, ప్రిన్సిపాల్, ఇతర సిబ్బందిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
భారతదేశంలో ఎయిమ్స్‌కు ఓ ప్రత్యేకత ఉంది. కాని అదే పేరుతో వెలిసిన ఈ విద్యా సంస్థ మాత్రం విద్యార్థులను మోసగించడమే పనిగా పెట్టుకున్నట్లు తెలుస్తోం ది. అమీర్‌పేట్‌లోని ఇమేజ్ హాస్పిటల్ లేన్‌లో అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ మెడికల్ సైన్సెస్ పేరు తో ఏర్పాటు చేసిన ఈ సంస్థలో పారా మెడికల్ పలు కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ కోర్సులు పూర్తిగా సైన్స్‌కు సంబంధించిన సబ్జెక్టులు కాగా, ఆర్ట్స్, కామర్స్, మ్యాథ్స్ విద్యార్థులూ అర్హులని ప్రచారం చేశారు.