జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 1 9: జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహ్మత్ నగర్ డివిజన్లోని శ్రీరామ్ నగర్ సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్సీ) లో కొత్తగా మరో 20 బెడ్స్ ఏర్పాటు చేసి 50 పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి(Collector Anudeep) వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ శ్రీరామ్ నగర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా సందర్శించారు. సోమవారం నమస్తే తెలంగాణ దిన పత్రికలో ఆరోగ్య కేంద్రానికి ఆదరణ కరువు.. గైనకాలజీ డాక్టర్ల కొరత.. భారీగా తగ్గిన ప్రసవాలు శీర్షికన వచ్చిన కథనానికి స్పందించి జిల్లా కలెక్టర్ దవాఖానను సందర్శించి సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రోగులతో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా బస్తీలు ఉన్న బోరబండ, రహ్మత్ నగర్ డివిజన్ల తోపాటు యూసుఫ్ గూడా, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్ డివిజన్ లలోని పేద మహిళలకు ఉపయోగ పడేలా దవాఖానను తీర్చిదిద్దుతామని వెల్లడించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, సీహెచ్సీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నవనీత్ రాజ్, వైద్యుల బృందంతో పాటు హెడ్ సిస్టర్ రోషన్, తదితరుల పాల్గొన్నారు.