సిటీబ్యూరో, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ ): విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల మంచి ఫలితాలు సాధించవచ్చని, ఉన్నత చదువులతోనే పై స్థాయి ఉద్యోగాలు సాధించే అవకాశం ఉంటుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. షేక్పేట్ ప్రభుత్వ సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల, జూనియర్ కళాశాలలో శుక్రవారం ఆయన రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ 10వ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులతో మాట్లాడుతూ పరీక్షలు అంటే భయం వీడి పట్టుదలతో చదవి మెరుగైన ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలన్నారు.
గత ఏడాది లాగా ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత ఉండాలన్నారు. విద్యార్థుల స్టడీ అవర్స్ తీరును గమనించి ఉపాధ్యాయులను అభినందించారు. నిద్రకు ఉపక్రమించే సమయంలో విద్యార్థులతో మాట్లాడుతూ భయం వీడాలని, పరీక్షల సమయంలో మానసిక ఆందోళన పడవద్దని, ప్రశాంత వాతావరణం లో రాయాలని సూచించారు. తల్లిదండ్రుల కలలు సాకారం చేయాలని ఆకాంక్షించారు.